Site icon Prime9

TGSRTC: గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ.. మహా శివరాత్రికి 3 వేల ప్రత్యేక బస్సులు

TGSRTC to operate 3000 special buses for Maha Shivaratri: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు టీజీఎస్‌ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 3 వేల ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ నెల 26న మహాశివరాత్రి కాగా, 24 నుంచి 28 వరకు ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది. శ్రీశైలానికి 800, వేములవాడకు 714 ఏడుపాయలకు 444, కీసరగుట్టకు 270, వేలాలకు 171, కాళేశ్వరానికి 80, కొమురవెల్లికి 51 బస్సులతో పాటు అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప, తదితర ఆలయాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు శనివారం టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది.

50 శాతం టికెట్ ధరలు సవరణ..
హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్‌సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్ ప్రాంతాల నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రభుత్వ జీవో ప్రకారం శివరాత్రికి నడిచే స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సంస్థ సవరించింది. అలాతే స్పెషల్ బస్సుల్లో 50 శాతం మేర టికెట్ ధరలను సవరించింది. రెగ్యులర్ సర్వీస్‌ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదని తెలిపింది. ఈ నెల 24 నుంచి 27 వరకు నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే సవరణ చార్జీలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఏడుపాయలకు తిరిగే స్పెషల్ బస్సుల్లో 26 నుంచి 28 వరకు సవరణ చార్జీలు వర్తిస్తాయని తెలిపింది. ప్రయాణికులకు సమాచారం నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ ప్లే బోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ సారి 809 బస్సులను అదనంగా సంస్థ నడపనుంది.

అధికారులను మంత్రి పొన్నం ఆదేశాలు..
భక్తుల రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి పొన్నం ఆదేశించారు. ప్రత్యేక సర్వీస్‌లను ఉపయోగించుకుని క్షేమంగా శైవాలయాలకు చేరుకొని భక్తులు మొక్కులు చెల్లించుకోవాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు. స్పెషల్ బస్సుల్లో జీవో ప్రకారం పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్టినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహాలక్ష్మీ-మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. నగరం నుంచి శ్రీశైలం, వేములవాడకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉందని వెల్లడించారు.

Exit mobile version
Skip to toolbar