Site icon Prime9

Telangana Police: పోలీసులా.. పోకిరోళ్లా..!

Prime9 Special: తెలంగాణ పోలీస్‌ శాఖలో కొందరు ఎస్‌.ఐ, సీఐ.లు లైంగిక వేధింపులకు పాల్పడుతూ డిపార్ట్‌మెంట్‌కే అపకీర్తి తెస్తున్నారు. తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని వివాహితలు, యువతులను అనుభవించడమే కాకుండా బ్లాక్‌మెయిల్ చేస్తూ కామాంధులుగా మారిపోతున్నారు. వీళ్ల లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

మొన్న మారేడ్‌పల్లి సీఐ శ్రీనివాసరావు నిన్న మల్కాజ్‌గిరి సీసీఎస్‌ ఎస్‌ఐ ధరావత్‌ విజయ్‌కుమార్‌. తాజాగా కొమురంభీమ్‌ ఆసిఫాబాద్ జిల్లాలో మరో సబ్‌ ఇన్స్‌పెక్టర్. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అధికారులు ఆడవాళ్లు, యువతుల పట్ల కామపిశాచాల్లా తయారయ్యాయి. తమ శారీరక కోరిక తీర్చమని లేదంటే చంపేస్తామని లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్న పోలీసు డిపార్ట్‌మెంట్‌కే చెడ్డపేరు తెస్తున్నారు. ఓ వివాహిత కణతపై తుపాకీ పెట్టి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మారేడ్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్‌రావును ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేశారు. ఆ కేసులో పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. ఈ కేసు దర్యాప్తుకు వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తమ్‌ రెడ్డి నేతృత్వంలో స్పెషల్ టీం ఏర్పాటు చేయగా, అత్యాచారం ఘటనా స్థలం నుంచి ఇబ్రహీంపట్నం యాక్సిడెంట్ వరకు కీలక ఆధారాలు సేకరించింది. లొంగిపోయిన నాగేశ్వరరావుని సిట్‌ బృందం వివిధ కోణాల్లో విచారించింది. ప్రాథమిక దర్యాప్తులో నేరం రుజువైందని సిట్‌ తేల్చింది. బాధితురాలితో పాటు ఆమె భర్తను బెదిరించడానికి, వారిపై దాడి చేయడానికి నాగేశ్వర్‌రావు తన అధికారిక పిస్టల్‌ వాడినట్లు ఫిర్యాదులో ఉంది. దీని ఆధారంగానే కేసు నమోదు చేసిన పోలీసులు ఆ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నాగేశ్వర్‌రావును హయత్‌నగర్‌ పోలీసులు మెజిస్ట్రేట్‌ ఇంటి వద్ద హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో నాగేశ్వరరావును చర్లపల్లి జైలుకు తరలించారు.

అమ్మాయిని శారీరకంగా వాడుకొని మోసం చేసిన కేసులో మరో పోలీస్ అధికారి సస్పెండ్ అయ్యారు. మల్కాజ్‌గిరి సీసీఎస్‌ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న విజయ్‌ ధరావత్, తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి మిర్యాలగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న విజయ్‌కుమార్ తనతో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపి, శారీరకంగా వాడుకున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. యువతితో శారీరక సంబంధం పెట్టుకున్న ఎస్ఐ విజయ్‌కుమార్ ఆమెకు తెలియకుండానే మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలిసిన బాధితురాలు విజయ్‌కుమార్‌ని నిలదీయడంతో తనతో సహజీవనం చేయాలని బెదిరించినట్లుగా బాధితురాలు పోలీస్‌ కంప్లైంట్‌లో పేర్కొంది. దీంతో ఉన్నతాధికారులు విజయ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేశారు.

గత రెండ్రోజులుగా ఇద్దరు పోలీసు అధికారుల నిర్వాకాలు బయటపడుతున్న సమయంలోనే మరో పోలీస్ అధికారి అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించి వార్తల్లో నిలిచారు. కొమురం భీమ్‌ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఓ సబ్‌ఇన్స్‌పెక్టర్ పోలీస్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న యువతికి ట్రాప్ చేశాడు. ఆమెకు ఫోన్ చేసి పోలీస్‌ స్టేషన్‌కి పిలిపించుకొని, ఉద్యోగానికి అవసరమై మెటిరియల్స్, పుస్తకాలు ఇస్తానంటూ మాయమాటలు చెప్పాడు. అంతేకాదు బాధిత యువతికి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చేలా చూస్తానంటూ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.
కామాంధుడి టార్చర్ భరించలేక, అతను చెప్పినట్లు చేయడం ఇష్టం లేని యువతి విషయాన్ని తన కుటుంబ సభ్యులతో చెప్పుకుంది. దీంతో వారు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సదరు ఎస్‌ఐ పై గతంలో కూడా ఆరోపణలు వస్తున్న క్రమంలో ఇంటెలిజెన్స్‌ అధికారులు కూడా ప్రత్యేక విచారణ చేస్తున్నట్లు తెలిసింది. యువతి, ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో పాటు వాళ్లు చూపించిన ఆధారాల ప్రకారం ఎస్‌ఐని విచారిస్తున్నట్లు సమాచారం.

నేరాలు, మోసాలు, అత్యాచారాలు, హత్యలను అరికట్టాల్సిన పోలీసులే మహిళల విషయంలో ఇంత దారుణంగా ప్రవర్తించడం సంచలనంగా మారింది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ పేరుతో ప్రజల మన్ననలు పొందాలని పోలీస్‌శాఖ చెబుతుంటే, అధికారులు మాత్రం ఇలాంటి అరాచకాలు, అఘాయిత్యాలకు పాల్పడుతూ పోలీస్‌శాఖకు చెడ్డ పేరు తెస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Exit mobile version