Site icon Prime9

Telangana: కులగణనపై అసెంబ్లీలో కాంగ్రెస్ తీర్మానం..గులాబీ పార్టీ అలర్ట్

Telangana Congress resolution on caste census in assembly: కులగణనపై అసెంబ్లీలో కాంగ్రెస్ తీర్మానంతో గులాబీ పార్టీ అలర్ట్ అయింది. క్షేత్రస్థాయిలో బీసీ నినాదంతో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్కు కౌంటర్ ఎలా ఇవ్వాలి..? బీసీ వర్గాలకు ఎలా దగ్గర కావాలనే దానిపై బీఆర్ఎస్ బీసీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు.

తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. అధికార-విపక్షాల మధ్య బీసీ పోరు మొదలైంది. బీసీలకు మేం అది చేశాం…ఇది చేశామని ఇరుపక్షాలు మాటల యుద్ధానికి తెరతీస్తున్నాయి. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో బీసీలకు కేసీఆర్ అన్యాయం చేశారని హస్తం పార్టీ అంటుంటే…లేదు లేదు బీసీలకు తామే అండగా నిలిచామని గులాబీ పార్టీ చెప్తోంది. అయితే కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనపై సర్వే నిర్వహించి ఆ వివరాలన్నింటిని అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసింది. దీంతో బీసీ వర్గాలు కాంగ్రెస్కు చేరువయ్యే ప్రమాదం ఉందని భావించిన గులాబీ అధిష్టానం అలర్ట్ అయింది. అసెంబ్లీలో కాంగ్రెస్ సర్వే రిపోర్టు అంతా తప్పుల తడక అంటూ లెక్కలతో వివరించేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం.. 2024 వరకు జనాభా 3 కోట్ల 84 లక్షలు. దాని ప్రకారం బీసీల జనాభా 56 శాతం ఉంటుందని గులాబీ పార్టీ అంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం 3 కోట్ల 75 లక్షల జనాభాకు కులగణన పరిమితం చేసిందని, దాదాపు 40 లక్షల బీసీ జనాభాను కనుమరుగు చేసిందని వాదిస్తోంది. బీసీల జనాభాను కేవలం 46.25 శాతం మాత్రమే చూపారని గులాబీ పార్టీకి చెందిన బీసీ నేతలు ఫైర్ అవుతున్నారు.

బీసీల కులగణనపై బీఆర్ఎస్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. రాబోయే స్థానిక సంస్థల్లో బీసీల అంశాన్ని ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. అంతేకాదు 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సమగ్ర కుంటుంబ సర్వే వివరాల్లో బీసీ జనాభా వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు గులాబీ నేతలు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తమ ప్రభుత్వంలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. తమ ప్రభుత్వ హయాంలో బీసీలకు అసెంబ్లీ స్పీకర్ పదవితో పాటు మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్, రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించి వారికి సముచితమైన గౌరవాన్ని ఇచ్చామని గులాబీ పార్టీ చెప్పుకుంటోంది. ప్రస్తుతం గులాబీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా మండలి ప్రతిపక్ష నేత, మండలి డిప్యూటీ చైర్మన్గా ఇద్దరు బీసీ నేతలే ఉన్నారని బీసీలను తమకు ఓన్ చేసుకునే ప్రయత్నం కారు పార్టీ చేస్తోంది.

అధికార కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణన రిపోర్టును బీఆర్ఎస్ తీవ్రంగా తప్పు పడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై చట్టం చేయకుండా పార్టీ పరంగా 42 శాతం సీట్లు ఇస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. ఇక బీఆర్ఎస్ తరపున మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి నేతృత్వంలోని బీసీ నేతల బృందం తమిళనాడు రాష్ట్రంలో పర్యటించారు. అక్కడ బీసీలకు రిజర్వేషన్లు ఏ విధంగా అమలు అవుతున్నాయనే దానిపై అధ్యయనం చేశారు. ఆ తర్వాత బీసీ నేతలతో కేసీఆర్ సమావేశం ఉంటుందనే చర్చ బీఆర్ఎస్ పార్టీలో జరిగింది. కానీ బీఆర్ఎస్ బీసీ నేతలు సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ కులగణన అంశం హాట్ టాపిక్ కావటంతో బీసీ నినాదంతో ముందుకు వెళ్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని గులాబీ పార్టీ భావిస్తోంది.

తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో ఉన్న బీసీలంతా గులాబీ పార్టీకి మద్దతు తెలిపారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోయింది. ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు దూరం కాగా బీసీలు అండగా నిలిచారు. దీంతో బీసీ ఓటు బ్యాంకు తమకు దూరం కాకుండా ఉండేందుకు బీసీ స్లోగన్ వినిపిస్తున్నట్లు బిఆర్ఎస్ వర్గాల్లో టాక్. మరోవైపు బీసీ రిజర్వేషన్ల అంశంపై ఎమ్మెల్సీ కవిత జాగృతి సంస్థ తరపున బీసీ సంఘాలతో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో కులగణన సర్వేపై బీసీల జనాభా తగ్గించి చూపారని ఆయా కుల సంఘాల నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా బీసీ కుల సంఘాల ఆందోళనలకు గులాబీ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. వచ్చే స్థానిక ఎన్నికల్లో పల్లెల్లో గులాబీ జెండా రెపరెపలాడాలంటే..పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న బీసీలకు మద్దతు ఇవ్వాల్సిందే అని పార్టీ అధిష్టానం డిసైడ్ అయిందని సమాచారం. బీసీల ఓటు బ్యాకుతోనే రేపు జరిగే లోకల్ ఫైట్ లో పార్టీ విజయం సాధిస్తుందని భావిస్తున్న గులాబీ బాస్ కేసీఆర్..వారికి అన్ని విధాలుగా అండగా నిలబడేందుకు సిద్ధమయ్యారని రాజకీయవర్గాల్లో టాక్ నడుస్తోంది.

Exit mobile version
Skip to toolbar