Ashada Bonalu 2023: ఆషాడమాసం వచ్చేసింది. కొత్త పెళ్లికూతుర్లు అయితే పుట్టింటికి చేరారు. అంతే కాదండోయ్ ఆషాడం అనగానే బాగా గుర్తొచ్చేవి బోనాలు. తెలంగాణ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న బోనాలకు యావత్ రాష్ట్రం ముస్తాబవుతోంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో నేటి నుంచి ఆషాఢ బోనాల జాతర ప్రారంభం కానున్నాయి. మొట్టమొదటగా గోల్కొండ బోనాలతో ఈ ఆషాఢ బోనాలు ప్రారంభం కానున్నాయి. లంగర్ హౌస్‌లో గోల్కొండ బోనాల తొట్టెల ఊరేగింపును ప్రభుత్వ లాంఛనాలతో ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఊరేగింపులో తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ పాల్గొని అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
ఆషాడ బోనాల పండుగతో జంటనగరాలు నెల రోజులపాటు కోలాహలంగా కనిపించనున్నాయి. బోనాల్లో భాగంగా.. ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గ్రామ దేవతలకు ప్రత్యేక నైవేధ్యాలు సమర్పిస్తారు. బోనాల పండుగకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బోనాల పండుగ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
ఇక జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాల, జులై 10న ఊరేగింపు నిర్వహించనున్నారు. మరోవైపు పాతబస్తీలో బోనాల ఉత్సవం జులై 16న ప్రారంభం కానుండగా జులై 17న ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి ఊరేగింపు నిర్వహించనున్నారు.
రూ.15 కోట్లతో బోనాల ఉత్సవాలు(Ashada Bonalu 2023)
ఇకపోతే బోనాలకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి తలసాని ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా బోనాల ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందని వివరించారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పేలా బోనాల పండగ నిర్వహిస్తామని మంత్రి తలసాని వెల్లడించారు.