Site icon Prime9

State Election Commission: రెండు విడతలుగా పంచాయితీ పోరు.. మార్చి 18 నాటికి పూర్తి చేయాలని ఈసీ యోచన

State Election Commission key decision to Local Body Elections: తెలంగాణలో రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న స్థానిక సంస్థల ఎన్నికలను వీలయినంత తొందరగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఢిల్లీ కేంద్రంగా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా పార్టీ కేంద్ర నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటికే మంతనాలు జరిపిన రేవంత్‌ రెడ్డి ఇప్పటికే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఇస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల గణనతో పాటు రుణమాఫీ. రైతుభరోసా వంటి కార్యక్రమాలు తమ ప్రభుత్వానికి సానుకూల ఫలితాలనిస్తాయని రేవంత్‌ భావిస్తున్నారు. అయితే విపక్షాలు మాత్రం సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని లెక్కలు వేస్తున్నాయి.

రంగంలోకి ఎన్నికల సిబ్బంది
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గానూ ఇప్పటికే ఎన్నికల సంఘం జిల్లాకు పదిమంది చొప్పున మాస్టర్‌ ఆఫ్‌ ట్రైనర్స్‌, స్టేట్ రిసోర్స్‌ పర్సన్‌లను ఎంపిక చేసింది. వారికి మర్రిచెన్నారెడ్డి మానవవనరుల సంస్థలో ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పాల్గొనే అధికారులకు శిక్షణ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. మరోవైపు మండల,జిల్లా పరిషత్‌, పంచాయతీ రిటర్నింగ్‌ అధికారులను ఫిబ్రవరి 10లోపు ఎంపిక చేయాలని ఎన్నికల సంఘం ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. అలాగే ఎంపిక చేసిన అధికారులకు ఫిబ్రవరి 12 లోపు శిక్షణ పూర్తి చేయాలని ఆదేశించింది. అలాగే పోలింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ పోలింగ్‌ అధికారులకు ఫిబ్రవరి 15 లోపు శిక్షణ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం సూచింది. పోలింగ్ సిబ్బందికి మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్‌తో శిక్షణ పూర్తి చేయాలని తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది.

వాటా తేలగానే రంగంలోకి
ఈ నెల 10న బీసీ రిజర్వేషన్ల పై డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవ్వనుండగా, ఈ నివేదిక రాగానే బీసీ, ఇతర రిజర్వేషన్లను ఖరారు చేయాలని సర్కారు భావిస్తోంది. ఇది పూర్తయిన వెంటనే ఎక్కువ వ్యవధి లేకుండా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేలా కసరత్తు జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఒకే విడతలో మండల, జిల్లా పరిషత్ పోలింగ్ నిర్వహించాలని, పంచాయితీ ఎన్నికలు మాత్రం రెండు విడతల్లో జరపాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. అన్నీ కుదిరితే.. మార్చి 17, 18 లోగా మొత్తం ఎన్నికలు పూర్తి చేయాలని ఈసీ భావిస్తోంది. ప్పటికే 570 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓటర్ల జాబితా వెల్లడికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. పోలింగ్‌ స్టేషన్ల తుది జాబితా 15న విడుదల కానుంది. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగానే నోటిఫికేషన్‌ ఇవ్వడానికి ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది.

ఓటరు ఎటో?
రేవంత్‌ నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కార్‌ ఈ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, బీసీ కుల గణన పూర్తి చేశామని అది ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేస్తోందని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. అయితే వందశాతం రుణమాఫీ కాలేదని, ప్రతి పథకంలోనూ కోతలు పెట్టారని, పథకాలు కాంగ్రెస్ కార్యకర్తలకే అందుతున్నాయంటూ విపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వంపై జనంలో ఉన్న వ్యతిరేకత తమకు కలిసొస్తుందని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓటరు ఎటు మొగ్గుతాడనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Exit mobile version
Skip to toolbar