Betting Apps Issue : తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. పలువురు సినీ, క్రికెట్ సెలబ్రెటీస్, యూట్యూబ్ స్టార్స్ చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ నమ్మి అమాయక ప్రజలు, యువకులు లక్షలాది రూపాయలు బెట్టింగ్స్‌లో పెట్టి మోసపోయిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది సులువుగా డబ్బులు వస్తాయనే ఆశతో అప్పులు చేసి, ఉన్న ఆస్తులు తనఖా పెట్టి మరీ బెట్టింగ్స్‌లో నిలువునా మోసపోయారు. అప్పులు తీర్చే దారిలేక పదుల సంఖ్యలో యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు తెలంగాణలో సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఇవాళ మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన సోమేష్ అనే యువకుడు క్రికెట్ బెట్టింగ్‌లో రూ.2 లక్షలు పోగొట్టుకొని, ఇంట్లో వాళ్లకు ముఖం చూపించలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ వ్యవహారంపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తీవ్ర ఆవేదన చెందారు. ఈ సందర్భంగా బెట్టింగ్ యాప్ బాధితులకు కీలక విజ్ఞప్తి చేశారు. సమస్య ఏదైనా సరే ఆత్మహత్యలే పరిష్కారం కాదన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ భూతానికి అలవాటు పడిన వారు ఆత్మహత్యలకు పాల్పడొద్దని యువకులకు విజ్ఞప్తి చేశారు. క్షణికావేషంలో తీసుకునే నిర్ణయాలతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంతటి క్షోభను అనుభవిస్తారో ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. సమస్య వచ్చినప్పుడు ఎలా బయటపడాలో అన్వేషించాలన్నారు. చనిపోవాలనే ఆలోచన రాకూడదన్నారు. ఉన్నది ఒక్కటే జీవితమన్నారు.
జీవన ప్రయాణంలో ఒక్కసారి కిందపడితే సర్వం కోల్పోయినట్లు కాదని చెప్పారు. నిత్యం కష్టసుఖాలు అందరినీ వెంటాడుతూనే ఉంటాయని, కష్టకాలంలో బాధలను ఇతరులతో పంచుకొని పరిష్కార మార్గాలు వెతకాలన్నారు. ఎంతకష్టం వచ్చినా ఎల్లకాలం ఉంటుందా? చనిపోయినంతా మాత్రాన సమస్యలు మాయమవుతాయా!? అనే ప్రశ్న వేసుకోవాలన్నారు. బలవన్మరణం వద్దు.. బతికి సాధించడమే ముద్దు అని యువతకు హితబోధ చేశారు.