Site icon Prime9

Prajapalana Celebrations: డిసెంబర్ 1నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు.. సంబరాలు నిర్వహణపై సచివాలయంలో సమీక్ష

Prajapalana Celebrations Review by CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా డిసెంబరు 1 నుంచి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం దీనిపై తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రజలకు చేసిన మేలు ఏమిటనేది వివరించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన మంత్రులు, అధికారులకు సూచించారు. ఈ ఉత్సవాలలో అన్ని శాఖలూ భాగస్వాములు కావాలని ఆదేశించారు.

ఏం చేశామో ప్రజలకు చెబుదాం
తాము అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ఇప్పటి వరకు సాగిన పాలనలో తాము ప్రజలకు చేసిన మేలు ఏమిటో నాయకుల నుంచి పార్టీ కార్యకర్తల వరకు అందరూ ఈ విజయోత్సవాల్లో ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి సూచించారు. దీనితో బాటు రాబోయే రోజుల్లో తాము చేపట్టనున్న కార్యక్రమాల కార్యాచరణ మీదా ప్రజలకు అవగాహన కల్పించాలని సలహా ఇచ్చారు.

రైతులు, మహిళలు, యువత భాగస్వామ్యం
విజయోత్సవాల్లో భాగంగా వరంగల్ నగరంలో ఈ నెల 19న మహిళా శక్తి సంఘాలతో ఏర్పాటు చేసిన సభ విజయవంతమైందని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. దీనికోసం పనిచేసిన అధికారులను సీఎం అభినందించారు. ఇదే ఊపులో ఈ నెల 30న పాలమూరులో జరిగే రైతు సదస్సుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డిసెంబర్ 4న పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ నిర్వహించాలని, ఆ సభలోనే గ్రూప్ 4తో పాటు వివిధ రిక్రూట్‌మెంట్ల ద్వారా ఎంపికైన 9వేల మందికి నియామక పత్రాలు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఆ మూడు రోజులూ ప్రత్యేకం
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆ మూడు రోజులపాటు హైదరాబాద్.లోని సెక్రటేరియట్ పరిసరాలు, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు ప్రాంతంలో ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని, అందులో తెలంగాణ సంస్కృతి, కళా రూపాలకు భాగస్వామ్యం కల్పించాలని సూచించారు. అలాగే, మ్యూజికల్ షోలు, కనుల పండువగా ఎయిర్ షో నిర్వహించాలన్నారు.

విద్యాసంస్థల్లో వేడుకలు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కాలేజీలు, హాస్టళ్లలో ప్రజాపాలన వియోజత్సవ వేడుకలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని రేవంత్ ఆదేశించారు. డిసెంబర్ 9న సెక్రటేరియట్ ముఖద్వారం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. లక్ష మంది తెలంగాణ ఆడబిడ్డల సమక్షంలో ఆ విగ్రహాన్ని ఆవిష్కరించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

నేడు హస్తినకు సీఎం
తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి నేడు (సోమవారం) ఢిల్లీ బయలుదేరనున్నారు. తెలంగాణ ఏడాది పాలన సందర్బంగా నిర్వహిస్తున్న విజయోత్సవ వేడుకలకు హాజరవ్వాలని ఈ సందర్భంలో ముఖ్యమంత్రి కాంగ్రెస్‌ అధిష్టానంలోని కీలక నేతలను ఆహ్వానించనున్నారు. ముఖ్యంగా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు సభకు హాజరుకావాలని రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా సీఎం .. పెండింగ్‌లో ఉన్న కార్పొరేషన్‌ పదవులు, మంత్రివర్గ విస్తరణపై కూడా కీలక నేతలతో చర్చించనున్నట్లు సమాచారం.

Exit mobile version