Site icon Prime9

PCC Chief Mahesh Kumar Goud: డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం కుట్ర: పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్!

PCC Chief Mahesh Kumar Goud

PCC Chief Mahesh Kumar Goud

PCC Chief Mahesh Kumar Goud Hot comments on Delimitation: డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం కుట్ర పన్నుతోందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. నియోజకవర్గాల పునర్విభనజపై కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలతో చర్చించి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ టూరిజం ప్లాజాలో ఇవాళ అఖిలపక్షం ఆధ్వర్యంలో పార్లమెంట్ నియోజకవర్గ పునర్విభజన-దక్షిణ భారత భవిష్యత్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. డిలిమిటేషన్‌పై చర్చించకుంటే చరిత్ర క్షమించదన్నారు. ఈ విషయంలో పార్టీలకు అతీతంగా కొట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. డిలిమిటేషన్ పేరుతో దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కల్పించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. 1971 నాటి జనాభా లెక్కల ప్రకారం ఏర్పడిన పార్లమెంటరీ నియోజకవర్గాలను కేంద్రం ఇప్పటివరకు స్తంభింపచేసిందన్నారు. దీన్ని మరో 25 ఏళ్ల పాటు పొడిగించాలని డిమాండ్ చేశారు. డిలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించి ఒప్పిస్తానని హామీ ఇచ్చారు.

 

బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలి..
తెలంగాణలో మతం పేరుతో 8 మంది ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు గెలిచిన బీజేపీ రాష్ట్రానికి తెచ్చిన నిధులు గుండు సున్నా అని విమర్శించారు. దేవుడు, రాజకీయాలకు ముడిపెట్టే బీజేపీకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాల తరఫున ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడాలని పిలుపునిచ్చారు. 11 ఏళ్లు పాలించిన నరేంద్ర మోదీ ఈ దేశానికి చేసింది ఏమీ లేదన్నారు. కుల మతాలు మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని మాత్రమే బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ప్రధాని మోదీ పదవి వ్యామోహం పిశాచి అన్నారు. రష్యా అధినేత పుతిన్ వల్ల నియంతలా దేశాన్ని పాలించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Exit mobile version
Skip to toolbar