KCR Presence in Budget : ఈ నెల 12 నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర కేబినెట్‌లో చర్చించి సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. తాజాగా బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫాంహౌజ్‌లో పార్టీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే కేసీఆర్ అసెంబ్లీకి వెళ్తారనే చర్చ జరుగుతోంది. పార్టీ సంస్థాగత నిర్మాణంతోపాటు ఎమ్మెల్సీకి సంబంధించి అభ్యర్థి ఎంపిక గురించి చర్చించారు. వచ్చే నెల 27న బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం, బడ్జెట్ సమావేశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. 2 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టేలా కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెనక్కి రప్పించేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కూడగట్టేలా పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం..
ఈ నెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. దాదాపుగా 3 గంటలకు పైగా సమావేశం కొనసాగింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు పార్టీని సంస్థాగతంగా బలోపేతం దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంలో ఒకరోజు మాత్రమే కేసీఆర్ హాజరయ్యారు. మరోసారి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో కేసీఆర్ హాజరవుతారా లేదా అని తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కేసీఆర్ అసెంబ్లీ వస్తారని తెలుస్తోంది. దీనిపై పార్టీ నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం.
25వ వసంతంలోకి బీఆర్ఎస్..
బీఆర్‌ఎస్ ఆవిర్భవించి ఏప్రిల్ 27 నాటికి 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగుపెట్టబోతోంది. దీంతో సిల్వర్‌జూబ్లీ పేరుతో బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లేదా వరంగల్‌లో నిర్వహించాలని కేసీఆర్ ఆలోచిస్లున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 10న బీఆర్‌ఎస్ ప్రతినిధుల సభ హైదరాబాద్ వేదికగా జరుగుతుందని గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. దానిపై కూడా సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పదేళ్లుగా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ సంస్థాగతంగా బలంగా లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు అనుబంధ విభాగాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ సందర్భంగా కొత్తగా కమిటీలు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశానికి కేటీఆర్, హరీశ్‌రావు, కవిత, మధుసూదనాచారి, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్‌రెడ్డి, పద్మారావుగౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్‌గౌడ్, దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు.