Site icon Prime9

PM Narendra Modi: ఫ్యామిలీ ఫస్ట్ కాదు.. పీపుల్ ఫస్ట్ అనేది బీజేపీ నినాదం.. ప్రధాని మోదీ

modi

modi

Hyderabad: తెలంగాణ పేరుతో కొందరు అధికారం పొంది తమ జేబులు నింపుకుంటున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. రాష్ట్రంలో త్వరలోనే అంధకారం పోతుందని, కొత్త సూర్యోదయం రాబోతుందన్నారు. తెలంగాణ ప్రజలకు కొందరు నాయకులు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. శనివారం బేగంపేట ఎయిర్ పోర్టు వద్ద ఏర్పాటు చేసిన స్వాగత సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ బీజేపీ కార్యకర్తలను చూసి తాను ఎంతో స్ఫూర్తి పొందానన్న మోదీ ఇక్కడి బీజేపీ కార్యకర్తలు ఎవరికీ భయపడరని అన్నారు. వారు తనలో కొత్త ఉత్సాహాన్ని నింపారని అన్నారు. మునుగోడు ఉపఎన్నికలో ప్రజలు బీజేపీకి ఒక భరోసా కల్పించారని అన్నారు. ఒక అసెంబ్లీ సీటు కోసం కేసీఆర్ ప్రభుత్వం మొత్తం మునుగోడుకు పోయిందని అన్నారు.

అవినీతి, కుటుంబ పాలనను బొందపెడతామని, అవినీతి, కుటుంబ పాలనలు ఎప్పుడూ కూడా అభివృద్ధికి ఆటంకమేనని మోదీ అన్నారు. అవినీతి పరులను వదిలే ప్రసక్తే లేదన్నారు. ఫ్యామిలీ ఫస్ట్ కాదు. పీపుల్ ఫస్ట్ అనేది బీజేపీ నినాదమని చెప్పారు. తెలంగాణ వికాసం బీజేపీ తోనే సాధ్యమన్న మోదీ కొంతమంది తనను తిట్టడమే ఎజెండాగా పెట్టుకున్నారని అన్నారు. నన్ను తిట్టడం తప్ప, వాళ్ళు చేస్తున్నది ఏమీ లేదు. కొత్త కొత్త పదాలు, డిక్షనరీలో లేని పదాలను వెతికి మరీ తిడుతున్నారు. నేను రోజూ 2, నుంచి 3 కేజీల వరకు తిట్లు తింటున్నాను. నన్ను తిడితే తెలంగాణ అభివృద్ధి చెందుతుందా?ఒకవేళ అభివృద్ధి చెందుతుంది అంటే నన్ను, బీజేపీని ఎంతైనా తిట్టండి. వాళ్ళు తిట్టే తిట్లన్నీ నా శరీరంలోకి వెళ్లి, ప్రాసెస్ జరిగి, న్యూట్రిషన్ గా మారి, ప్రజలకు సేవ చేసేందుకు శక్తిని ఇస్తోందంటూ మోదీ పేర్కొన్నారు.

తెలంగాణతో బీజేపీకి ప్రత్యేక అనుబంధం ఉందని మోదీ చెప్పారు. 1984 ఎన్నికల్లో తమ పార్టీ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకోగా, అందులో ఒకటి తెలంగాణా నుంచి హన్మకొండ సీటు అని అక్కడ నుంచి జంగారెడ్డి గెలిచారని గుర్తుచేశారు. ఐటీ హబ్ అయిన హైదరాబాద్‌లో మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. ఐటీలో ముందున్న రాష్ట్రాన్ని అంధవిశ్వాస శక్తులు పాలిస్తున్నాయని అన్నారు. ఎర్రజెండా నేతలు అభివృద్ది, సామాజిక న్యాయానికి వ్యతిరేకులని విమర్శించారు. అభివృద్ది వ్యతిరేకులతో ఇక్కడి సర్కార్ జత కట్టిందని విమర్శించారు. కేబినెట్‌లో ఎవరిని ఉంచాలి. ఎవరిని తీసేయాలనేది మూఢనమ్మకాలు నిర్ణయిస్తున్నాయని విమర్శించారు.

Exit mobile version