Narrow Escape for CM Revanth Reddy in Lift Accident: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఎక్కిన లిఫ్ట్… ఓవర్ లోడ్ కారణంగా ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీని కారణంగా లిఫ్ట్ ఉండాల్సిన ఎత్తు కంటే లోపలికి రెండు అడుగులు దిగిపోయింది. దీంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే సిబ్బంది సీఎం రేవంత్ రెడ్డిని లిఫ్ట్‌లో నుంచి బయటకు సురక్షితంగా తీసుకొచ్చారు.
అయితే, తొలుత ఎందుకు ఇలా జరిగిందని ఎవరికీ అర్థంకాలేదు. తర్వాత ఓవర్ లోడ్ కారణంగా జరిగిందని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. వాస్తవానికి లిఫ్ట్‌లో 8 మంది ఎక్కాల్సి ఉండగా.. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరో 12 మంది ఎక్కారు. అందుకే లిఫ్ట్ ఓవర్ వెయిట్ కారణంగా లిఫ్ట్ ఆగాల్సిన చోటు కంటే రెండు అడుగులు లోపలికి దిగింది.
కాగా, లిఫ్ట్ 2 అడుగులు కిందకు వెళ్లడంతో పాటు అందులోనే సీఎం రేవంత్ రెడ్డి ఉండడంతో కాసేపు టెన్సన్ పడ్డారు. వెంటనే సీఎం సెక్యూరిటీతో పాటు హోటల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. హుటాహుటినా లిఫ్ట్ ఓపెన్ చేసి సీఎం రేవంత్ రెడ్డిని సెకండ్ ఫ్లోర్‌కు పంపించి వేరే లిఫ్ట్‌లో తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పడంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.