Site icon Prime9

Bandi Sanjay: తెలంగాణలో ప్రజా తిరుగుబాటు..అందుకే మహారాష్ట్రలో ఓటమి

MP Bandi Sanjay Press Meet In Karimnagar: తెలంగాణలో ప్రజా తిరుగుబాటు రాబోతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ యుద్దం ప్రకటించబోతోందన్నారు. మహారాష్ట్రలో ఎన్ని అబద్దాలు ప్రచారం చేసినా కాంగ్రెస్ కూటమిని ప్రజలు నమ్మలేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని, గతంలో కంటే ఎక్కువ మెజారిటీ సీట్లు బీజేపీ కూటమికి కట్టబెట్టడమే ఇందుకు నిదర్శనమ‌న్నారు. కాంగ్రెస్ ఐరన్ లెగ్ పార్టీ అని, ఆ పార్టీతో జతకట్టిన పార్టీలన్నీ మునిగిపోతున్నాయన్నారు.

అబద్దాలు పనిచేయలే..
తెలంగాణ, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలే మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి పుట్టిముంచాయిని బండి సంజయ్ అన్నారు. ఈ రెండు రాష్ట్రాలలో హామీలను నేరవేర్చకుండా, ఇదే మాట మహారాష్ట్రలో చెప్పటంతో అక్కడి జనం హస్తం పార్టీని నమ్మలేదన్నారు. కోట్లాది రూపాయలతో యాడ్స్ ఇచ్చినా, వందల అబద్ధాలు చెప్పినా మహారాష్ట్ర ప్రజలు వాస్తవాలు గుర్తించి తగిన తీర్పునిచ్చారని, వారి విజ్ఞతకు హాట్సాఫ్ అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల కోసం తెలంగాణ ప్రభుత్వ పెద్దలు పెద్దమొత్తంలో డబ్బు మూటలు చేరవేశారని ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మహారాష్ట్రలో తిష్టవేసి పోలింగ్ బూత్‌ల వారీగా ప్రచారం చేసినా జనం పట్టించుకోలేదన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమి తర్వాత ఇండియా కూటమి బలహీన పడటం ఖాయమని సంజయ్ జోస్యం చెప్పారు.

ఇక్కడా అదే గతి
తెలంగాణ కాంగ్రెస్‌లోనూ త్వరలో లుకలుకలు మొదలు కాబోతున్నాయని, కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎవరూ పడగొట్టాల్సిన పనిలేదని, ఆ పార్టీ ఎమ్మెల్యేలే ఆ పనిచేస్తారని అన్నారు. బీజేపీ ప్రజాతీర్పును గౌరవించే పార్టీ అని, తమకు ఇలాంటి అవసరం లేదన్నారు. కనుక ఇకనైనా, మహిళలకు తులం బంగారం, స్కూటీ, నెలనెలా రూ.2500 లు ఎప్పుడు ఇస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమాధానం చెప్పాలన్నారు. రైతుకు పంటసాయం, మద్దతుధర, బీమా,పెండింగ్ రుణమాఫీల అమలు ఎప్పుడో ఇకనైనా ప్రభుత్వం చెప్పాల్సి ఉందన్నారు.

అంతటా అసంతృప్తి
ఏడాది రేవంత్ రెడ్డి పాలనపై ఇప్పటికే రైతులు, మహిళలు, రైతు కూలీలు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, మధ్యతరగతిలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని బండి చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలకు నిధులు లేవని చెబుతున్న కాంగ్రెస్ నేతలు, మరి.. మహారాష్ట్రకు డబ్బు సంచులు ఎలా మోశారో చెప్పాలని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం తమ సొంత గ్రామాల్లోనూ ముఖం చూపించుకోలేని పరిస్థితిలో ఉన్నారని సంజయ్ ఎద్దేవా చేశారు. తాము ప్రతిపాదించిన పనులు ఒక్కటీ పూర్తి కాకపోవటంతో ఎమ్మెల్యేలూ అసంతృప్తితోనే ఉన్నారన్నారు.

అది బోగస్ గణన..
కులగణన ఫారాల మీద వివరాలను పెన్సిల్‌లో రాసి, సంతకం మాత్రం పెన్నుతో తీసుకుంటున్నారని సంజయ్ ఆరోపించారు. ఆ వివరాలను ప్రభుత్వం తర్వాత మార్చే యత్నం చేస్తోందన్న అపోహతోనే జనం ఈ కులగణనకు సహకరించటం లేదన్నారు. మహారాష్ట్రలో ఓటమి తర్వాత అక్కడి విపక్ష నేతలు ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేయటంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎంలు బీజేపీ చేతిలో ఉంటే గతంలో తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, నేడు జార్ఖండ్‌లో కాంగ్రెస్ ఎలా గెలిచిందని ప్రశ్నించారు. ఇలాంటి ఆరోపణలను జనం నమ్మరని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదన్నారు.

Exit mobile version