Miss World Competition To Be Held In Hyderabad: మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హైదరాబాద్ వేదిక కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్ వేదికగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం మిస్ వరల్డ్ పోటీల నిర్వాహకులు షెడ్యూల్ విడుదల చేశారు. పోటీలు మే 7 నుంచి 31 వరకు హైదరాబాద్ వేదికగా నిర్వహించనున్నారు. ముగింపు వేడుకలు కూడా హైదరాబాద్‌లో జరగనున్నాయి. మిస్ వరల్డ్ పోటీలకు 120 దేశాల నుంచి యువతులు పాల్గొననున్నారు.
బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే థీమ్‌తో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించనుండగా, దేశ విదేశాల ప్రతినిధులకు తెలంగాణ స్వాగతం పలుకబోతున్నది.
భారత్‌లో 28 ఏళ్ల తర్వాత..
ప్రపంచ సుందరి అందాల పోటీలు 28 ఏళ్ల తర్వాత భారత్‌లో జరగనున్నాయి. మిస్ వరల్డ్ పోటీలను 1951లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఎరిక్ మోర్లీ స్థాపించారు. దశాబ్దాలుగా ఈ ఐకానిక్ పోటీలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో జరుగుతున్నాయి. ఈ ఫెస్టివల్ బికినీ కాంటెస్ట్ అని పిలిచే ఈవెంట్ బ్రిటిష్ ప్రెస్ ప్రచార బాధ్యతలు నిర్వహించింది.
మొదటి మిస్ వరల్డ్‌గా కెర్‌స్టిన్ ‘కికీ’
మిస్ వరల్డ్ పోటీలు మొదటిసారి నిర్వహించినప్పుడు స్వీడన్‌కు చెందిన కెర్‌స్టిన్ ‘కికీ’ హకాన్సన్ మొదటి మిస్ వరల్డ్‌గా నిలిచింది. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ వార్షిక మిస్ వరల్డ్ ఫైనల్స్‌ను పర్యవేక్షించే బాధ్యత కలిగిన ఉండటంతో పోటీని ప్రపంచంలోనే అతిపెద్ద ఈవెంట్‌గా మార్చింది. ఈ సంస్థ వికలాంగులు వెనుకబడిన పిల్లలకు సహాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థల నుంచి విరాళాలు సేకరించి 100 కంటే ఎక్కువ దేశాల్లో సేవలు అందిస్తుంది.
భారత్‌లో 1996లో చివరిసారి..
భారతదేశంలో చివరిగా 1996లో మిస్ వరల్డ్ పోటీకి ఆతిథ్యం ఇచ్చింది. తిరిగి మూడు దశబ్దాల తర్వాత ఈ పోటీని దేశంలో అది కూడా తెలంగాణలోని హైదరాబాద్‌లో నిర్వహించనుంది. అయితే మొదట ఢిల్లీలో పోటీలు నిర్వహించాలని నిర్ణయించగా, తాజాగా మిస్ వరల్డ్ పోటీల హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.