Prime9

Miss World 2025: 72వ మిస్‌వరల్డ్‌ పోటీల నుంచి వైదొలగిన మిస్‌ ఇంగ్లాండ్‌ మిల్లా మాగీ: స్పందించిన మిస్ వరల్డ్!

Miss England Milla Magee withdraws from competition: హైదరాబాద్‌లో జరుగుతోన్న 72వ ప్రపంచ సుందరీమణుల పోటీల నుంచి మిస్‌ ఇంగ్లాండ్‌ -2025 మిల్లా మాగీ వైదొలిగింది. దీంతో మిస్‌ వరల్డ్‌ సంస్థ స్పందించింది. ఇటీవల బ్రిటీష్‌ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాలపై మిస్‌ వరల్డ్‌ సంస్థ చైర్‌పర్సన్‌, సీఈవో జూలియా మోర్లే స్పందించారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ మిస్‌ ఇంగ్లాండ్‌ మాగీ చేసిన ఆరోపణలను ఖండించారు.

 

ఈ నెల ప్రారంభంలో మిస్‌ ఇంగ్లాండ్‌ మాగీ తన తల్లి, కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి అత్యవసర పరిస్థితి కారణంగా పోటీల నుంచి విరమించుకోవాలని సంస్థను కోరినట్లు తెలిపారు. మిల్లా పరిస్థితి అర్థం చేసుకొని వెంటనే స్పందించారు. ఆమె కుటుంబ సభ్యుల క్షేమం కోసం ప్రాధాన్యతగా పరిగణించామన్నారు. వెంటనే ఆమెను ఇంగ్లాండ్‌కు తిరిగి పంపే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

 

మిల్లా పోటీల నుంచి వైదొలిగిన తర్వాత మిస్ ఇంగ్లాండ్ మొదటి రన్నరప్ మిస్ షార్లెట్ గ్రాంట్ ఇంగ్లాండ్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు ముందుకొచ్చారని వెల్లడించారు. మిస్ షార్లెట్ బుధవారం భారత్‌కు చేరుకున్నారని పేర్కొన్నారు. మిస్ వరల్డ్ సోదరభావంతో ఆమెను పోటీల్లో పాల్గొనేందుకు అనుమతించినట్లు చెప్పారు. ఆమె పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. బ్రిటిష్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాలు, కొన్ని యూకే మీడియా సంస్థలు మిల్లా మాగీ పోటీల్లో ఎదుర్కొన్న అనుభవాలపై తప్పుడు కథనాలు ప్రచురించాయని పేర్కొన్నారు. అవి పూర్తిగా నిరాధారమైనవని తోసిపుచ్చారు.

 

మిస్ వరల్డ్ పోటీల ప్రారంభ సమయంలో మిస్ మిల్లా మాగీ స్వయంగా వ్యక్తపరిచిన భావాలు, ఎడిట్ చేయని వీడియో క్లిప్‌లు మిస్ వరల్డ్ సంస్థ విడుదల చేసింది. అందులో ఆమె ఆనందం, కృతజ్ఞత, అనుభవం మెచ్చుకుంటూ మాట్లాడిన దృశ్యాలు ఉన్నాయని మోర్లే చెప్పారు.

Exit mobile version
Skip to toolbar