Site icon Prime9

Bhupalapalli Murder: మేడిగడ్డ ప్రాజెక్టుపై కేసు వేసిన వ్యక్తి దారుణ హత్య

Medigadda complainant murdered in Bhupalapalli: తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ భూపాలపల్లి కోర్టులో కేసు వేసిన మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి హత్యకు గురయ్యారు. భూపాలపల్లి రెడ్డి కాలనీలో ఆయనపై కొంతమంది దుండగులు కత్తితో దాడి చేసి పరారయ్యారు. వెంటనే తీవ్ర గాయాలతో ఉన్న ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందారు.

పాలపల్లిలో కత్తులు, గొడ్డళ్లతో దుండగులు నరికి చంపినట్లు స్థానికులు చెబుతున్నారు. హంతకులను పట్టుకునేంత వరకు అంత్యక్రియలు చేయమని కుటుంబ సభ్యులు వెల్లడించారు. మేడిగడ్డ కుంగుబాటుపై రాజలింగమూర్తి కేసు వేసిన సంగతి తెలిసిందే. రాజలింగ మూర్తిపై గతంలో పోలీసులు భూతగాదా కేసులు నమోదు చేశారు.

కాగా, మేడిగడ్డలో అక్రమాలు జరిగాయని రాజలింగమూర్తి గతంలో కేసు వేశారు. దీంతో మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు జిల్లా కోర్టు గతంలో నోటీసులు ఇచ్చింది. అయితే ఈ కేసుపై రేపు హైకోర్టులో విచారణ ఉండగా.. ఇంతలోనే ఆయన హత్యకు గురయ్యారు. కానీ భూ వివాదమే హత్యకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

ఇదిలా ఉండగా, రాజలింగమూర్తి హత్యకు నిరసనగా ఆయన కుటుంబీకులు రాత్రి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. తన భర్తను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చంపించాడని రాజలింగమూర్తి భార్య పోలీసులకు వెల్లడించింది. ఈ మేరకు ఆమె పోలీసులు ఎదుట కన్నీరుమున్నీరుగా విలపించారు. మరోవైపు ఈ హత్యను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్చే గండ్ర ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

రాజలింగమూర్తి హత్య ఘటనపై  సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఉన్నతాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఐడీ విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మృతుడు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుకు బీఆర్ఎస్ కారణమని కేసు వేసిన సంగతి తెలిసిందే.

Exit mobile version
Skip to toolbar