Medico Preethi: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన వైద్య విద్యార్థిని ప్రీతి ఘటన అందరికీ తెలిసిందే. అయితే ప్రీతి చెల్లి పూజకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగం లభించింది. ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిన టైంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించి.. సీఏం ఆదేశాలమేరకు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. ఇపుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ (హెచ్ఎమ్ డీఏ)లో ఉద్యోగం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూజకు ఐటీ సెల్ లో కాంట్రాక్ట్ పద్దతిలో సపోర్ట్ అసోసియేట్ గా ఉద్యోగం ఇచ్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది హెచ్ఎమ్ డీఏ. ప్రభుత్వం తరపున ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం(Medico Preethi)
‘మెడికో ప్రీతి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటామని ఆరోజు చెప్పాం. ఇప్పటికే గవర్నమెంట్ ప్రకటించిన పరిహారంతో పాటు పార్టీ తరపున సేకరించిన విరాళాలను కూడా కలిపి ప్రీతి కుటుంబానికి అందజేశాం. అదే సమయంలో తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని వారు కోరగా.. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టి తీసుకెళ్లాం. అందుకు సాకుకూలంటా స్పందించిన కేటీఆర్.. తన పరిధిలోన హెచ్ఎండీఏలో ఉద్యోగం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు’అని ఎర్రబెల్లి తెలిపారు.
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 22 న వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో పీజీ అనస్థీషియా మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి పాయిజెన్ ఇంజెక్షన్ తీసుకుని బలవన్మరణానికి యత్నించింది. అపస్మారక స్థితిలోకి చేరుకున్న ఆమెకు ముందు వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకొచ్చారు. 5 రోజుల పాటు నిమ్స్‌లో మృత్యువుతో పోరాడిన ప్రీతి మృతి చెందిన విషయం తెలిసిందే.