Medaram Jatara: గిరిజనుల ఆరాధ్య దైవం.. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా మేడారం జాతర ప్రసిద్ధి చెందింది. ఈ జాతర ప్రతి రెండేళ్లకు ఓసారి ఘనంగా జరుగుతోంది. ఈ జాతరకు.. వివిధ రాష్ట్రాల నుండి కోట్లాదిగా వచ్చే భక్తులతో మేడారం కుంభ మేళాను తలపిస్తుంది. వచ్చే ఏడాది జాతర తేదీలను ఖరారు చేశారు.
తేదీలు ఖరారు.. ఎప్పుడంటే?
మేడారం జాతరకు ఆసియా ఖండంలోనే విశిష్ట గుర్తింపు ఉంది. కొండా కోనల్లో గిరిజన సాంప్రదాయాలతో నిర్వహించే ఈ జాతరకు ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు వస్తారు. ఎడ్ల బండ్ల నుండి హెలికాఫ్టర్ వరకు రవాణా సౌకర్యాలతో అటు ప్రాచీన సంస్కృతి , ఆధునిక నాగరికతల మేళవింపుగా మేడారం జాతర ఆకట్టుకుంటుంది.
వచ్చే ఏడాది అంటే.. 2024 ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు ఈ జాతర జరగనుంది. ఈ మేరకు మేడారం పూజారుల సంఘం ఈ తేదీలను ప్రకటించింది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న మాఘశుద్ధ పంచమి బుధవారం రోజున మండెమెలగడం, గుడి శుద్ధీకరణతో జాతర ప్రక్రియను ప్రారంభిస్తారు. ఈ సారి సుమారు 10 నెలల ముందే జాతర తేదీలను ప్రకటించారు. ఈసారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులు చేపట్టడానికి నిధులు మంజూరు చేయాలని పూజారులు కోరారు.
జాతర తేదీలు ఇవే..
ఫిబ్రవరి 21: మాఘశుద్ధ ద్వాదశి బుధవారం సాయంత్రం గద్దెల మీదకు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు
ఫిబ్రవరి 22: చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవత రాక.
ఫిబ్రవరి 23: సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లకు మొక్కుల సమర్పణ.
ఫిబ్రవరి 24: మాఘశుద్ధ పౌర్ణమి శనివారం అమ్మవార్ల వన ప్రవేశం, మహా జాతర ముగింపు.
ఫిబ్రవరి 28: మాఘశుద్ధ బహుళ పంచమి బుధవారం రోజున తిరుగువారం పండుగ.