Site icon Prime9

food poisoning: వికటించిన మధ్యాహ్న భోజనం.. భోజనం చేస్తుండగానే సొమ్మసిల్లిన విద్యార్థులు

Maganur School food poisoning incident: తెలంగాణలోని నారాయణపేట్‌ జిల్లా మాగనూరు జిల్లా పరిషత్‌ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 25 మంది విద్యార్థులు బుధవారం అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తుండగా విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు చేసుకోవటంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారిలో కొంత మందికి ప్రాథమిక చికిత్స అందించి వారి ఇళ్లకు పంపించారు.

పాడైన ఆహారం వల్లేనా..
విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అందించిన పాడైన వంటకాల మూలంగానే ఈ సమస్య తలెత్తిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాగా, 9 మంది విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం మక్తల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరికొంత మందికి పాఠశాల వద్దే వైద్యుడి సమక్షంలో చికిత్స అందిస్తున్నారు.

సీఎం సీరియస్..
కాగా, ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు ఫోన్ చేసి ఘటనపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, ఆ విద్యార్థులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని చెప్పారు. విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించే విషయంలో రాజీపడేది లేదని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరికలు జారీ చేశారు.

Exit mobile version