Site icon Prime9

Lokmanthan: ఐక్యత కోసమే లోక్‌మంథన్.. హాజరుకానున్న రాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి

Lokmanthan-2024 from today in Shilparam: భారత సాంస్కృతిక వైవిధ్యాన్ని, అందులోని గొప్పదనాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేందుకు హైదరాబాద్‌ శిల్పారామం వేదికగా నేటి నుంచి నాలుగురోజుల పాటు లోక్‌మంథన్‌-2024 కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి చేతుల మీదగా నేడు ప్రారంభం కానున్న ఈ ఉత్సవానికి, రెండవ రోజు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హాజరు కానుండగా, 24న జరిగే ముగింపు వేడుకకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ హాజరుకానున్నారు.

లోక్‌మంథన్ దేనికి?
వేర్వేరు సంస్కృతులున్నప్పటికీ అంతర్గతంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలుపుకున్న మనదేశంలో ప్రజల మధ్య చీలికలు తెచ్చి వారిలో ద్వేషభావనలు నింపే కార్యక్రమం జోరుగా సాగుతోంది. దీనిని నివారించి మన దేశపు ఏకత్వాన్ని చాటి చెప్పేందుకు, కలిసి ఉండాల్సిన అవసరాన్ని చాటి చెప్పటమే ఈ కార్యక్రమ లక్ష్యం. లోక్‌ మంథన్ వేదికగా పలువురు మేధావులు ఈ అంశంపై తమ అభిప్రాయాలను, అనుభవాలను వివరించనున్నారు.

3 అంశాలపై ఫోకస్..
ఈసారి లోక్ మంథన్ కార్యక్రమంలో లోక్ విచార్ (ప్రకృతి, సాంస్కృతిక సంబంధమైన ఆలోచనా ప్రక్రియ), లోక్ వ్యవహార్ (సంప్రదాయాల, ఆచరణ), లోక్ వ్యవస్థ (సంస్థలు,వ్యవస్థలు) అనే మూడు అంశాల కేంద్రంగా చర్చ, కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ క్రమంలో సైన్స్, సాహిత్యం, అర్థశాస్త్రం, పర్యావరణం, న్యాయం తదితర అంశాలపై సదస్సులు నిర్వహించనున్నారు.

అద్భుత జానపద మేళా..
దేశంలోని జానపద కళాకారులందరూ ఒకే వేదిక మీద తమ ప్రతిభను చాటేలా ఈ కార్యక్రమంలో పలు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ప్రజ్ఞా ప్రవాహ్ అనే సంస్థ ఆధ్వర్యంలో వనవాసి, గ్రామవాసి, నగరవాసి మొత్తంగా భారతీయ వాసి అనే భావనను జానపద ప్రదర్శనలు సాగనున్నాయి. రెండేళ్లకోసారి జరిగే ఈ లోక్ మంథన్ కార్యక్రమం తొలిసారి 2016లో భోపాల్‌లో, తర్వాత రాంచీ, గౌహతిలో జరిగిందని ఈసారి హైదరబాద్ శిల్పారామం దీనికి వేదిక కానుందని నిర్వాహకులు తెలిపారు.

అందరూ ఆహ్వానితులే..
జాతీయ గిరిజన గౌరవ దివాస్‌గా బిర్సాముండా 150వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివాసులు, గిరిజనులు తమ చేతివృత్తుల ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. ఈ నాలుగు రోజుల్లో వందకు పైగా సాంస్కృతిక కార్యక్రమాలు, దాదాపు 1500 మందికి పైగా కళాకారులతో సంప్రదాయ సంగీత వాయిద్యాలు, పనిముట్ల ప్రదర్శనలు ఉంటాయి. ప్రవేశం అందరికీ ఉచితమేని, లక్షలాది మంది ఈసారి ఈ వేడుకకు తరలి వస్తారని నిర్వాహకులు చెబుతున్నారు.

16 దేశాల సాంస్కృతిక కళాకారులు..
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ వివిధ వృత్తులు, రంగాల కళాకారులతో బాటు ఇండోనేషియా కళాకారులు రామాయణం ఆధారంగా ప్రదర్శించే కేచక్ నృత్య ప్రదర్శన, అబ్రహామిక్ మతాలకు పూర్వమున్న మతాలు, సంస్కృతుల వారు సైతం లోక్‌మంథన్‌కి రానున్నారు. వీరిలో సిరియాలోని రోమోలు, ఆర్మేనియాలోని యజిదీలు (సూర్యపుత్రులు), లిథువేనియా వాసులున్నారు. తమ పూర్వీకుల నుంచి వచ్చిన సూర్యారాధన, హవన విధానాలను వీరు ఇక్కడ ప్రదర్శించనున్నారు. లోక్‌మంథన్ ఎగ్జిబిషన్స్‌లో తెలంగాణతో సహా 10 రాష్ట్రాలకు చెందిన విభిన్న సంస్కృతులు, కళలు, చిత్రాల ప్రదర్శన, సంప్రదాయ ఆహారం, సంప్రదాయ క్రీడలు, సాహిత్యం, చర్చలు ఉంటాయి.

Exit mobile version