Site icon Prime9

Bayyaram Mines: బయ్యారం ఉక్కు పరిశ్రమపై కీలక అప్‌డేట్ రాబోతోందా..?

Bayyaram Mines: బయ్యారం ఉక్కు పరిశ్రమపై కీలక అప్‌డేట్ రాబోతోందా? సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? అందుకే సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారా? అసలు కాంగ్రెస్‌ సర్కార్ ప్రణాళిక ఎలా ఉంది? కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏమంటోంది? క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది? ప్రజా సంఘాలు, కార్మికుల ఏమంటున్నారు?

బయ్యారం ఉక్కు పరిశ్రమ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఫ్యాక్టరీ ఏర్పాటుపై అధికారులతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. పరిశ్రమ ఏర్పాటుపై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. స్థానిక ఐరన్‌తో పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై చర్చించారు. ఇతర ప్రాంతాల నుంచి దిగుబడి చేసుకుని ఐరన్ తయారు చేయాలా అన్న దానిపై సమాలోచనలు చేశారు. పరిశ్రమపై పూర్తి స్థాయి నివేదికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం.

ప్రభుత్వ ఆధ్వర్యంలో సొంతంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న విషయాన్ని అధికారులతో చర్చించారు. సర్కార్ నేతృత్వంలోనే ప్రైవేట్ ప్లాంట్‌ చేస్తే బాగుంటుందా..లేక ప్రభుత్వమే నడిపిస్తే ఎలా ఉంటుందన్న దానిపై చర్చించారు. బయ్యారంలో నాణ్యతపై పూర్తి స్థాయి సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని నిక్షేపాలపై ఆరా తీశారు. అక్కడి నుంచి రైలు మార్గం ద్వారా తీసుకొస్తే బాగుంటుందా అని అధికారులను అడిగారు. బయ్యారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు.

దీనిపై త్వరలో మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. భేటీలో సమగ్ర నివేదికను అందజేయాలన్నారు. రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు విషయాన్ని మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్తారని ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత కూడా సానుకూలంగా నిర్ణయం రాకపోతే సొంతంగానే పరిశ్రమ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.

2014లో ఏపీ పునర్విభజన సమయంలో అప్పటి యూపీఏ సర్కార్ పలు కీలక హామీలను ఇచ్చింది. అందులో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రధానంగా ఉంది. ఐతే ఆ తర్వాత కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. 10 ఏళ్లు గడిచినా పరిశ్రమను పట్టించుకోలేదు. ఇటు అప్పటి రాష్ట్ర సర్కార్‌ కూడా ముందడుగు వేయలేదన్న విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో ప్రైవేట్ వ్యక్తులు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినా కేంద్ర సర్కార్ పట్టించుకోలేదన్న టాక్‌ ఉంది.

బయ్యారంలో నాణ్యత లేదని..అందుకే ఏర్పాటు చేయలేదని ఎన్డీఏ సర్కార్ అంటోంది. దీనిపై అన్ని విషయాలను తెలుసుకున్నామని చెబుతోంది. సమగ్ర సమాచారం తర్వాతే ఈనిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేస్తోంది. ఇటీవల తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్..విభజన హామీలపై దృష్టి పెట్టింది. బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసి తీరుతామంటున్నారు. ఈమేరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామంటున్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటుకు మోదీ సర్కార్ ముందుకు రాకపోయినా సొంతంగానే నడుపుతామంటోంది రేవంత్ ప్రభుత్వం.

మరోవైపు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. మహబూబాబాద్ జిల్లాలో ప్రజా సంఘాలు ఆందోళనలు ఉధృతం చేస్తున్నాయి. బయ్యారం పరిశ్రమను ఏర్పాటు చేయాల్సిందేనని అంటున్నారు. అక్కడ విలువైన నిక్షేపాలు ఉన్నాయని చెబుతున్నారు. కక్షపూరితంగానే కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే హామీ ఇచ్చింది..ఇప్పుడు ఆ సర్కారే ఆచరణలో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈపరిణామాలతో తెలంగాణలో బయ్యారం వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. మరి సీఎం రేవంత్‌రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారా? ఆయన ప్రణాళిక వర్కౌట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.

Exit mobile version