Hyderabad Traffic Rules : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132 వ జయంతిని పురస్కరించుకొని నేడు హైదరాబాద్ నగరంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ అనంతరం భారీ బహిరంగ సభ ఉండడంతో పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 14 మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8గంటల వరకు వాహనాల దారి మళ్లింపు ఉంటుంది అని పోలీసులు సూచించారు. నెక్లెస్ రోడ్డు, ఖైరతాబాద్, లక్డీకాపూల్, తెలుగు తల్లి జంక్షన్ రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
నెక్లెస్ రోడ్డు – ఎన్టీఆర్ మార్గ్ జంక్షన్ వైపు వాహనాలకు నో ఎంట్రీ Hyderabad Traffic Rules..
- పంజాగుట్ట, సోమాజీగూడ, ఖైరతాబాద్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలు షాదన్ కళాశాల మీదుగా దారి మళ్లింపు.
- సంజీవయ్య పార్కు, నెక్లెస్ రోడ్డు నుంచి ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్ వైపు వెళ్లే వాహనాలు రాణిగంజ్ మీదుగా తరలింపు.
- లక్డీకాపూల్ నుంచి ట్యాంక్ బండ్, లిబర్టీ వైపు వెళ్లే వాహనాలు తెలుగు తల్లి ఫ్లైఓవర్, లోయర్ ట్యాంకు బండ్ వైపు మళ్లింపు.
- ట్యాంక్ బండ్, బీఆర్కే భవన్, తెలుగుతల్లి జంక్షన్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలు లక్డీకాపూల్ వైపు మళ్లింపు.
అదే విధంగా ఈరోజు ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, పీవీ నరసింహారావు మార్గ్, లుంబినీ పార్క్ మూసి ఉంటాయి. ఖైరతాబాద్, సైఫాబాద్, రవీంద్ర భారతి, మింట్ కాంపౌండ్, నల్లగుట్ట, లోయర్ ట్యాంక్ బండ్, లిబర్టీ, తెలుగు తల్లి సిగ్నళ్ల వద్ద భారీ వాహనాల రద్దీ ఉండే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రత్యామ్నయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు తెలియజేస్తున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియాను అనుసరించాలని చెప్పారు. ఏదైనా అత్యవసరం ఉంటే ట్రాఫిక్ కంట్రోల్ హెల్ప్ లైన్ నెంబర్ 9010203626 కు ఫోన్ చేయాలని కోరారు.
Hyderabad Traffic Rules విగ్రహావిష్కరణ కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు ..
హుస్సేన్ సాగర్ సమీపాన ఎన్టీఆర్ గార్డెన్ కు ఆనుకుని ఉన్న స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఉన్న అంబేద్కర్ విగ్రహాల్లో ఇదే ఎత్తైనది కావడం విశేషం. పార్లమెంటు ఆకారంలో 50 అడుగుల పీఠాన్ని నిర్మించి, దాని పైన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఉంచారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అలానే బీఆర్ఎస్ ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారు. అన్ని ప్రాంతాల ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా రవాణా శాఖ ఏర్పాట్లు చేసింది.
విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం రూ. 10 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దాదాపు 750 బస్సులను వివిధ ప్రాంతాల నుంచి నడవనున్నాయి. 50 వేల మంది కూర్చునేలా విగ్రహ ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. రెండు లక్షల మంచి నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, 80 వేల స్వీట్ ప్యాకెట్లను సిద్ధం చేశారు. విగ్రహావిష్కరణ సందర్భంగా 20 మంది బౌద్ధ గురువులు ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపిస్తారు.