Site icon Prime9

Hyderabad: శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీకి 40 నిమిషాలే!

Hyderabad Metro MD NVS Reddy on Future City Metro Rail Project: ప్యూచర్ సిటీ మెట్రో కారిడార్​కు సంబంధించిన సర్వే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్యూచర్ సిటీ వరకు కొనసాగుతున్న మెట్రో సర్వే పనులను ఆదివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్​ వరుసలో నాలుగో సిటీగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలన్న సీఎం రేవంత్ దార్శనికత దిశగా అడుగులు పడుతున్నాయన్నారు.

ఫ్యూచర్ సిటీ కాలుష్య రహిత గ్రీన్ సిటీగా..
ఫ్యూచర్ సిటీ కాలుష్య రహిత గ్రీన్ సిటీగా ప్రపంచంలోనే అద్భుత నగరాల సరసన చేరాలన్నది సీఎం సంకల్పమని పేర్కొన్నారు. అందులో భాగంగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో రైలు సంస్థ హెచ్ఎండీఏ, టీజీఐఐసీలతో కలిసి మెట్రో రైలు విస్తరణ ప్రణాళిక సిద్ధం చేస్తోందన్నారు. దాదాపు 15 వేల ఎకరాల్లో విస్తరించనున్న ఫ్యూచర్ సిటీని కాలుష్య రహిత నగరంగా రూపొందించడంతోపాటు అంతర్జాతీయ స్థాయి ప్రయాణ సౌకర్యాలు కల్పించడంలో మెట్రో రైలుతో కూడిన ఈ గ్రీన్ కారిడార్ కీలక పాత్ర పోషిస్తుందని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.

ఆకర్షణీయంగా అభివృద్ధి..
ఎయిర్ పోర్ట్ నుంచి మీర్ ఖాన్ పేట్​లో నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు మెట్రో కారిడార్ డీపీఆర్ తయారీ కోసం జరుగుతున్న సర్వే పనులను ఎన్వీఎస్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డీపీఆర్ కోసం జరుగుతున్న సర్వే పనులపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మెట్రో మార్గం దాదాపు 40 కిలోమీటర్లు ఉంటుందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచనలకు అనుగుణంగా బహదూర్‌గూడలో 15వేల ఎకరాల ప్రభుత్వ భూమిని అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తోడ్పడేలా బహదూర్‌గూడ, పెద్ద గోల్కొండలలో రెండు మెట్రో స్టేషన్లను అత్యంత ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

మార్చి వరకు పూర్తి..
వైఎస్ఆర్ సీఎంగా ఓఆర్ఆర్ నిర్మిస్తున్నప్పుడు ఓఆర్ఆర్​లో అంతర్భాగంగా భవిష్యత్​లో నిర్మించబోయే మెట్రోకి తగినంత స్థలాన్ని కేటాయించాలన్న అప్పటి తన ప్రతిపాదనను వైఎస్ఆర్ అంగీకరించి ఓఆర్ఆర్​లో 20 మీటర్లు మెట్రోకి కేటాయించారని ఎన్వీఎస్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. అప్పట్లో అనేక మంది ఓఆర్ఆర్, మెట్రో వంటి బృహత్ ప్రణాళికలు కేవలం కాగితలకే పరిమితమవుతాయని, అవి ఆచరణ సాధ్యం కాదని అపహాస్యం చేసినా, ప్రస్తుతం ఓఆర్ఆర్, మెట్రో రెండూ కూడా కార్యరూపం దాల్చాయని అయన పేర్కొన్నారు. దీంతో హైదరాబాద్ మహా నగరం అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందిందన్నారు. తద్వారా ప్రపంచంలో ఉన్న ప్రముఖ కంపెనీలను, పెట్టుబడులను ఆకర్షిస్తోందన్నారు. నార్త్ సిటీలోని మేడ్చల్, శామీర్ పేట్ కారిడార్లతో పాటు, ఈ ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ డీపీఆర్ కూడా మార్చి నెలాఖరుకు పూర్తిచేసి, ప్రభుత్వ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి వీటిని సమర్పిస్తామని తెలిపారు.

Exit mobile version
Skip to toolbar