Kishan Reddy : డీలిమిటేషన్ చేస్తే సీట్లు తగ్గుతాయని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. పునర్విభజనకు సంబంధించి 2009లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటి విధానాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై కొత్త విధానం రాలేదన్నారు. శనివారం రైల్వే ఎంజీ అరుణ్ కుమార్ జైన్‌తో కలిసి ఆయన బేగంపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించారు.
మహిళ ఉద్యోగులు ఉండేలా చొరవ తీసుకుంటాం..
రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలోని రైల్వేస్టేషన్ల స్వరూపం మారబోతున్నదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. బేగంపేట రైల్వే స్టేషన్‌లో మహిళా ఉద్యోగులే ఉండేలా చూస్తామన్నారు. వచ్చే ఏడాది నాటికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు పూర్తవుతాయన్నారు. రూ.26.55 కోట్లతో మొదటి విడత పనులు జరుగుతున్నాయని, మరో రూ.12 కోట్లతో రెండో విడత పనులు పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. గతంలో రైల్వే స్టేషన్ల పరిస్థితి అధ్వానంగా ఉండేదని, ప్రధాని మోదీ స్వచ్ఛభారత్ కార్యక్రమం ద్వారా స్వచ్ఛ రైల్వే స్టేషన్ పేరుతో వినూత్న మార్పులు తీసుకువచ్చామన్నారు. తెలంగాణలో రైల్వే ట్రాక్‌ల దగ్గర ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సికింద్రాబాద్‌కు ఐదు వందే భారత్ రైళ్లు వచ్చాయన్నారు. చర్లపల్లితోపాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల వద్ద అప్రోచ్ రోడ్లు బాగుండాలన్నారు. భూసేకరణ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు. వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జంటనగరాల్లో ఉన్న రైల్వే స్టేషన్ల ఆధునీకీకరణ కోసం ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశామన్నారు. ఇందుకు ప్రధాని అంగీకరించారన్నారు.
త్రిభాషా విధానం దేశంలో కొత్తదేమీ కాదు..
త్రిభాషా విధానం దేశంలో కొత్తదేమీ కాదన్నారు. ఏ ఒక్కరిపై బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేయడం లేదన్నారు. సీఎంగా స్టాలిన్ ఏ చేశారో చెప్పి తమిళనాడు ప్రజలకు ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. భాష పేరుతో దేశాన్ని విభజించాలని చూడటం సరైన పద్ధతి కాదన్నారు. తమిళ భాషలో తీసిన సినిమాలు హిందీలో డబ్ చేసి నిర్మాతలు లాభాలు పొందుతున్నారని, వాళ్లకు లాభాలు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు.