Badrachalam: రామయ్య సంబురాలకు భద్రాద్రి ముస్తాబవుతోంది. జానకిరాముల వివాహ వేడుకను వైభవంగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. అశేష భక్తజనం మధ్య..
రఘురాముడికి పట్టాభిషేకం జరపనున్నారు.
సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధం (Badrachalam)
రామయ్య సంబురాలకు భద్రాద్రి ముస్తాబవుతోంది. జానకిరాముల వివాహ వేడుకను వైభవంగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది.
అశేష భక్తజనం మధ్య.. రఘురాముడికి పట్టాభిషేకం జరపనున్నారు. దీంతో భద్రాద్రి రాములోరి గుడిని విద్యుత్ దీపాలతో అలంకరించారు.
విద్యుత్ దీపాల వెలుగులో కొత్త శోభ సంతరించుకుంది. అలాగే ప్రధాన కూడళ్లతో పాటు మెయిన్ సెంటర్లలో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు.
ఆలయ పరిసరాలతో పాటు స్వామివారి వివాహ వేడుక జరగనున్న మిథిలా ప్రాంగణంలో వేసవిని దృష్టిలో పెట్టుకుని చలువ పందిళ్లు వేయించారు.
శ్రీరామనవమి పర్వదినాన్ని జరుపుకోవడానికి దేశ వ్యాప్తంగా ఆలయాలు ముస్తాబయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలం క్షేత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. రాములోరి కల్యాణానికి భద్రాద్రి అంగరంగ వైభంగా ముస్తాబైంది. శ్రీరామ నవమి వేడుకలు భద్రాచలంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు, అర్చకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లు..
భద్రాచలంలో సీతారాములు వేడుకల ఉత్సవాలు.. ఉగాది నుంచి ప్రారంభం అయ్యాయి. శ్రీరామనవమిని పురస్కరించుకుని మిథిలా మండపంలో గురువారం కల్యాణం జరుపుతారు. ఇదే వేదికపై పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకాన్ని శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహిస్తారు. మంగళవారం నుంచి ఏప్రిల్ 5 వరకు నవాహ్నిక తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. బుధవారం నుంచి శుక్రవారం వరకు భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అదేస్థాయిలో వీఐపీలు రానున్నారు. ఈనేపథ్యంలో వసతి సమస్య తప్పదని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి ఇబ్బంది లేకున్నా.. నిర్వాహకులు బ్లాక్ చేసుకున్న గదుల అద్దెలను సామాన్యులు భరించలేరు.
హాజరుకానున్న ప్రముఖులు
ఉత్సవాలకు ప్రముఖులు హాజరుకానున్నారు. జస్టిస్ శ్రీదేవి, జస్టిస్ నవీన్‌రావుతో పాటు.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ఈ వేడుకకు హాజరు కానున్నారు. శుక్రవారం జరిగే పట్టాభిషేకం ఉత్సవంలో పాల్గొని పర్ణశాల ఆలయాన్ని సందర్శిస్తారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్‌తో పాటు మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రానున్నట్లు సమాచారం.