Deputy CM Bhatti Vikramarka Sensational Comments: సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 100 రోజుల్లో అమలు చేశామన్నారు. కాంగ్రెస్‌లో మంత్రులంతా పని మంతులే అని చెప్పారు. బుధవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం మీడియా ప్రతినిధులో చిట్‌చాట్ నిర్వహించి మాట్లాడారు. వాళ్ల లాగే ఉన్నామని కేటీఆర్ అనుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఫిరాయింపులను ప్రోత్సహించడం లేదని స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఢిల్లీ పర్యటనలో కేబినెట్ విస్తరణపై చర్చ జరగలేదన్నారు. మూసీ బాధితులకు అన్నివిధాల అండగా ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఇందరమ్మ ఇండ్లకు త్వరలో భూమి పూజలు..
వయనాడ్‌లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ అత్యధిక మెజార్టీతో గెలిచారని డిప్యూటీ సీఎం అన్నారు. మహారాష్ట్రలోని లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందన్నారు. మహారాష్ట్రలో ఈవీఎం టాంపరింగ్ గురించి తనకు తెలియదన్నారు. రాజ్యాంగాన్ని బలహీన పర్చాలని బీజేపీ చేస్తున్న కుట్రను ప్రజలు తిరస్కరిస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ పెంపులో సైంటిఫిక్‌గా రూపొందించాలని సుప్రీం చెప్పిందని గుర్తుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది త్వరలో చర్చిస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు త్వరలో భూమి పూజలు ఉంటాయని కీలక ప్రకటన చేశారు.
త్వరలో రైతుభరోసా..
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలో రైతు భరోసా ఇస్తామని భట్టి తెలిపారు. 12 రోజుల్లో రూ.18వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామన్నారు. ఇప్పటివరకు దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వకుండ పదేళ్లు కాలక్షేపం చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు తమపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు. నాలుగేళ్లలో నాలుగు విడుతలుగా లక్ష రుణమాఫీ చేసిందన్నారు. అది వడ్డీ భారంగా మారిందన్నారు. ఉద్యోగుల జీతాలు, అప్పులకు వడ్డీలు కట్టడానికే రాష్ట్ర ఆదాయం సరిపోతుందన్నారు. ప్రజలను మతాల పేరిట విడగొట్టింది బీజేపీ అని విమర్శించారు. కుల గణన నివేదిక వచ్చాక చర్చ చేసి ఏది మంచో అది చేద్దామని చెప్పారు.
దేశానికే తెలంగాణ రోల్ మోడల్..
తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని డిప్యూటీ సీఎం అన్నారు. కేటీఆర్ కొన్నిరోజులుగా ఏమి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. మూడెకరాల భూమి
ఇస్తామని మోసం చేశారన్నారు. వాళ్లు ఏమి చేయకుండా ఇప్పుడు అన్ని మాట్లాడితే ఎలా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 57వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. బాబ్ క్యాలెండర్ విడుదల చేశామని తెలిపారు. కనీసం గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేదన్నారు. తెలంగాణను అప్పుల బారిన పడేయడం తప్పా మీరు చేసిందేమి లేదన్నారు. విద్యార్థుల చదువుల అంశంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందన్నారు. ఫుడ్ పాయిజనింగ్ ఘటన దురదృష్టవశాత్తూ జరిగిందన్నారు. ఇప్పటికే హైజీనిక్ ఫుడ్, న్యూట్రీషియన్ ఫుడ్స్ అందించాలని ఆదేశించామన్నారు. కేటీఆర్ మైండ్ సెట్ అర్థమవుతుందన్నారు. ఇంకా బూర్జువా, భూస్వామ్య వ్యవస్థ లక్షణాలు పోలేదన్నారు. ఐఏఎస్ అధికారులు అంటే రెస్పెక్ట్ లేదని మండిపడ్డారు. సంస్కారం లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడడం సరైంది కాదన్నారు.
ఝార్ఖండ్ ప్రజల విజయం..
ఝార్ఖండ్ ప్రజల విజయమని భట్టి విక్రమార్క అన్నారు. ఉమ్మడిగా పోటీ చేయడం.. మంచి గెలుపును ఇచ్చిందన్నారు. బీఆర్‌ఎస్ వాళ్ల లాగానే మేము ఉన్నామని అనుకుంటున్నారన్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్నారు. కేటీఆర్, బీఆర్‌ఎస్ భ్రమల్లో బతుకుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో తొలగించడం ఎవ్వరి తరం కాదన్నారు. పాలమూరులో ఈ నెల 30న రైతు సభ నిర్వహించబోతున్నామని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ ప్రక్షాళన, ఇండస్ట్రియల్ క్లస్టర్స్, మిడిల్ క్లాస్ వారికి ఇల్లు విషయంలో మంచి ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నామన్నారు. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు, హెచ్ ఐజీ, ఎల్ ఐజీ, ఎంఐజీకి పక్కా ప్రణాళికతో ఉన్నామన్నారు. ఏఐ లాంటి టెక్నాలజీతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు.