Site icon Prime9

Rajiv Yuva Vikasam : ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం.. సీఎం రేవంత్‌రెడ్డి

Rajiv Yuva Vikasam

Rajiv Yuva Vikasam : రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రారంభించారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, పార్టీ నేతలతో కలిసి పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.

 

 

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మొదటి సంవత్సరంలోనే 54 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం చెప్పారు. భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం దేశంలో మరొకటి లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, 43 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తున్నామన్నారు. త్వరలోనే స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 65 లక్షల మంది మహిళలకు 1.20 కోట్ల నాణ్యమైన చీరలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలోని ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

 

 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అవినీతి..
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కులగణన జరగలేదన్నారు. సమాజానికి ఎక్స్‌ రే వంటి కులగణన దేశమంతా జరగాలని రాహుల్‌ గాంధీ చెప్పారని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టామన్నారు. ఎస్సీల వర్గీకరణ కోసం 35 ఏండ్లుగా ఉద్యమం సాగుతోందని, దశాబ్దాలుగా నానుతున్న ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. అబద్ధాల పునాదుల మీద తాము ప్రభుత్వాన్ని నడపలేమని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అవినీతి, దుబారాకు పాల్పడిందని ఆరోపించారు. దుబారా ఖర్చులను తగ్గించుకుంటూ అప్పులు చెల్లిస్తున్నామన్నారు. ఒక్క ఇసుక విక్రయంలో రోజువారీ ఆదాయం రూ.3 కోట్లు పెరిగిందని చెప్పారు. తెలంగాణలో జీఎస్టీ వసూళ్లలో 17 శాతం నమోదైందన్నారు. ధరల పెరుగుదలను నియంత్రించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉందని చెప్పారు.

ఎలాంటి ఆరోపణలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ..
తనకు పరిపాలనపై పట్టు రాలేదని కొందరు అంటున్నారని, మంత్రివర్గం నుంచి మంత్రులను తొలగిస్తేనే పట్టు ఉన్నట్టా? అని ప్రశ్నించారు. అధికారులను తొలగించి, బదిలీలు చేస్తేనే పాలనపై పట్టు సాధించినట్లు అవుతుందా? ఎలాంటి ఆరోపణలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాల్లో పారదర్శకంగా వ్యవహరించాలని తమ ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. నిజమైన అర్హులకు పథకాలు వర్తింపజేయాలని అధికారులకు సూచించారు. అన్నివర్గాల ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం కలిగించడమే తమ లక్ష్యమన్నారు.

 

 

స్వయం ఉపాధిపై దృష్టి : భట్టి
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా స్వయం ఉపాధి కల్పించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. యువ వికాసం పథకాన్ని ఉపయోగించుకొని యువత ఉపాధి కల్పించుకోవాలని కోరారు. యువ వికాసం పథకాన్ని గ్రామీణ యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఏడాది కాలంలోనే గ్రూప్‌-1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించామన్నారు. తెలంగాణలో ఒకప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని ధర్నాలు జరిగేవి. ఇప్పుడు నోటిఫికేషన్ల మధ్య కొంత గ్యాప్‌ ఇవ్వాలని ధర్నాలు జరిగే రోజులొచ్చాయని చెప్పారు. యువతకు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల కల్పనతో పాటు స్వయం ఉపాధిపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.

 

‘రాజీవ్‌ యువ వికాసం’ ఎవరికి..
రాజీవ్‌ యువ వికాసం పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. యువ వికాసానికి ఈ రోజు నుంచి ఏప్రిల్‌ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 6 నుంచి మే 30 వరకు లబ్ధిదారుల ఎంపిక, యూనిట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుంది.

కేటగిరీ-1 కింద రూ.లక్ష వరకు రుణం, 80 శాతం రాయితీ
కేటగిరీ-2 కింద రూ.2 లక్షల సాయం, 70 శాతం రాయితీ
కేటగిరీ-3 కింద రూ.3 లక్షల సాయం, 60 శాతం రాయితీ ఇవ్వనుంది.

Exit mobile version
Skip to toolbar