Site icon Prime9

CM KCR: నేడు మునుగోడులో టీఆర్ఎస్ బహిరంగ సభ

Munugode: మునుగోడు ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజా దీవెన బహిరంగ సభ నిర్వహిస్తోంది. మునుగోడులో లక్ష మందితో నిర్వహించనున్న ‘ప్రజా దీవెన’ సభకు సీఎం కేసీఆర్‌ హాజరవనున్నారు. హైదరాబాద్‌ నుంచి కేసీఆర్ భారీ ర్యాలీగా మునుగోడుకు చేరుకుంటారు. మునుగోడులో మాత్రం నోటిఫికేషన్‌ వెలువడకముందే భారీ సభను నిర్వహించాలని నిర్ణయించారు. ప్రజా దీవెన సభ నిర్వహించాలని 10రోజుల క్రితమే నిర్ణయించగా, ఉమ్మడి జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు మండలాల వారీగా బాధ్యతలు అప్పగించి జనసమీకరణ యత్నాలు ప్రారంభించారు.

మధ్యాహ్నం 2 గంటలకు సభాస్థలికి చేరుకోనున్న సీఎం మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటూ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యనేతలతో సమావేశమవుతారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. మరోవైపు ఈ సభలోనే పార్టీ తరఫున ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై పార్టీ వర్గాల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.

మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిత్వం పట్ల టీఆర్ఎస్ అధిష్ఠానం మొగ్గు చూపుతుందనే వార్తల నేపథ్యంలో అన్ని మండలాల్లోనూ అసమ్మతి నేతలు ఇప్పటికే వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. దీంతో ఈ సభ అనంతరం నియోజకవర్గంలోని సర్పంచ్‌లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేసి అందరి నుంచి అభిప్రాయ సేకరణ చేసి ఆ తర్వాతనే అభ్యర్థిపై సీఎం కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ ముఖ్యనేతలు వెల్లడించారు.

Exit mobile version
Skip to toolbar