Hyderabad: తెలంగాణ తిరుమల ఆలయంగా విరాజిల్లుతున్న చిలుకూరు బాలాజీ టెంపుల్ కు చేరుకోనే భక్తులను గుంతల పడ్డ రోడ్డు మార్గం గుబులు తెప్పిస్తుంది. గత కొద్ది సంవత్సరాలుగా ప్రధాన రోడ్డు మార్గం నుండి బాలాజీ ఆలయానికి చేరుకొనే మార్గం చినుకు పడితే చిత్తడి నేలగా మారిపోతుంది. వర్షపు నీరు రోడ్డు పైకి చేరి భారీ గుంతలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం రోడ్డు మరమ్మత్తులను సక్రమంగా చేపట్టకపోవడంతో ఆలయ పూజారులే గుంతలు పడ్డ రోడ్డును పూడ్చేందుకు నడుం బిగించారు.
పూజలు చేసి రోడ్డు మార్గాన్ని సరిచేసే పనికి శ్రీకారం చుట్టారు. జేసిబీలతో మట్టితోలి, గులక రాళ్లతో చదునుచేస్తూ గుంతల పడ్డ రోడ్డు మార్గాన్ని సరిచేస్తున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్ సుందర్ రాజన్ మాట్లాడుతూ నిత్యం వేలల్లో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వస్తుంటారన్నారు. శాస్వత రోడ్డు నిర్మాణానికి అనుమతలు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదన్నారు. ద్విచక్ర వాహనంపై వచ్చే భక్తులు అనేకులు గుంతల రోడ్డులో పడి, దెబ్బలు తింటున్నారని పేర్కొన్నారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామే తన భక్తుల కోసం గుంతల పడ్డ రోడ్డును సరిచేసుకొంటున్నారని సంచలన వ్యాఖ్యాలు చేశారు. గతంలో టెంపుల్ కు చేరుకొనే రోడ్డు మార్గంలో 9 సార్లు గుంతలు పూడ్చి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూశామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: విద్యార్ధులకు బస్సు సౌకర్యం కల్పించండి.. తెలంగాణ సర్కారుకు పవన్ లేఖ