Meenakshi Natarajan : పీసీసీ రాష్ట్ర కార్యవర్గం ఎంపిక మళ్లీ మొదటికి వచ్చింది. ఇంతకాలం పేర్లు దాదాపుగా ఖరారు అయ్యాయని, నేడు, రేపో ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు పీసీసీ కార్యవర్గం ఎంపిక తీరు మారింది. జిల్లాల వారీగా పార్టీ కోసం బాగా కష్టపడి పనిచేస్తున్న వారిని మొదటిగా గుర్తించాలని మీనాక్షి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయింది. ఈ క్రమంలోనే గతంలో, ఇప్పుడు పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న కార్యకర్తలు, నేతలకు పదవులు ఇవ్వాలని నూతన ఇన్‌చార్జి సూచించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన నేతలు, పలుకుబడి ఉన్నవారు పీసీసీలో కీలక పదవులు దక్కించుకునేందుకు మూడు నెలలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరిని ఎంపిక చేయాలనేది రాష్ట్ర నేతలకు కష్టంగా ఉండేది.
రాహుల్ ఆదేశాలతో రంగంలోకి..
కానీ రాహుల్‌గాంధీ ఆదేశాలతో మీనాక్షి రంగంలోకి దిగింది. అధిష్ఠానం సూచనలను తప్పకుండా పాటిస్తూ పదవులు చేపట్టాలని చెప్పినట్లు సమాచారం. పీసీసీ కాకుండా మిగిలిన నామినేటెడ్ పదవుల భర్తీకి జిల్లాల వారీగా అర్హులైన పార్టీ నేతలను గుర్తించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రులకు పీసీసీ సూచించింది. ఈ నేపథ్యంలో వారు ఎమ్మెల్యేలు, మంత్రులతో చర్చిస్తున్నారు. అనంతరం పేర్లతో ప్రతిపాదనలు తీసుకుంటున్నారు. పేర్లు అందిన తర్వాత రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి, సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చర్చించి పీసీసీ రాష్ట్ర కార్యవర్గానికి తుది ప్రతిపాదనలు ఖరారుచేసి అధిష్ఠానం ఆమోదం కోసం పంపుతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పార్టీ కార్యక్రమాలను సైతం విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు..
ఈ నెల మొదటివారంలో లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పార్టీ సమావేశాలు నిర్వహించాలని, ముఖ్యనేతలను పిలిచి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని మీనాక్షి సూచించినట్లు తెలుస్తోంది. సమావేశాలకు ఆమె రానున్నారని పార్టీవర్గాలు తెలిపాయి. ఏయే నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య సఖ్యత లేదు, ఎవరు వర్గాలను పోషిస్తూ వివాదాలకు కారణమవుతున్నారనే సమాచారం కూడా పీసీసీ సేకరిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు, పాతవారికి మధ్య పడకపోవడంతో పీసీపీ అధ్యక్షుడు మహేశ్ మాట్లాడుతూ నచ్చజెపుతున్నారు.
అందరూ కలిసి పనిచేయాలి..
అందరూ కలిసిమెలిసి పార్టీ బలోపేతానికి పనిచేయాలని, నిర్లక్ష్యం చేసినవారిని ఉపేక్షించేది లేదని మీనాక్షి హెచ్చరించినట్లు సమాచారం. తొలి సమావేశం నుంచి తన పనితీరు ఎలా ఉండబోతుందనేది ఆమె స్పష్టంగా చెప్పారు. ఇంతకుముందు జిల్లాలు, వర్గాలవారీగా నేతలు వెళ్లి పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జిని కలిసి తమకు అవకాశాలు కల్పించాలని కోరేవారు. కానీ ఇప్పుడు అలా కుదరదని, తానే అన్ని విషయాలు నేరుగా తెలుసుకుంటానని చెప్పినట్లు సమాచారం. పైరవీలు, పలుకుబడి ఆధారంగా పదవులిచ్చే విధానం ఇక నుంచి ఉండదని మీనాక్షి తేల్చి చెప్పినట్లు సమాచారం. అందుకు అనుగుణంగా పీసీసీ పనితీరులో కూడా మార్పులు రానున్నాయని నేతలు అంచనా వేస్తున్నారు.