Man Died in Aleru MLA Beerla Ilaiah’s Home: ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య నివాసంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గంధమల్ల రవి అనే వ్యక్తి యాదగిరిగుట్టలోని ఎమ్మెల్యే నివాసంలోని పెంట హౌస్‌లో అద్దెకు ఉంటున్నాడు. తాను ఉంటున్న గదిలోనే రవి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల రవిని ఎమ్మెల్యే మందలించినట్లు సమాచారం. రెండురోజులుగా మృతుడి సొంత గ్రామం సైదాపురంలోనే ఉన్న అతడు ఎమ్మెల్యే నివాసంలో ఉరేసుకొని మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే సైదాపురంలోని ఇంట్లో ఉరేసుకొని ఉండవచ్చునని గ్రామస్తులు అంటున్నారు. భార్యతో కలిసి కొన్నేళ్లుగా ఎమ్మెల్యే ఇంట్లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రాత్రికి రాత్రి అతడి మృతదేహాన్ని భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని ఎమ్మెల్యే అయిలయ్య సందర్శించారు.
విచారణ చేపట్టాలి : బీఆర్ఎస్
ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇంట్లో గంధమల్ల రవి మృతిచెందిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తవుతున్నాయని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య అన్నారు. ఎందుకు ఉరేసుకోవాల్సి వచ్చిందో అర్థం కావడం లేదు. రాత్రికి రాత్రే మృత దేహాన్ని భువనగిరికి ఎందుకు తరలించారని ప్రశ్నించారు. మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీబీసీఐడీ అధికారులతో విచారణ చేపట్టాలని కోరారు.