4 Died in Road Accident Parigi Vikarabad: వికారాబాద్ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రావెల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. అలాగే ఈ ఘటనలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండగా.. మరో 20 మందికిపైగా గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడినుంచి మెరుగైన చికిత్స అవసరం ఉండగా… హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలంలో ఉన్న చెన్వెళ్లి గ్రామానికి చెందిన కొంతమంది వివాహ రిసెప్షన్ కోసమని పరిగికి ట్రావెల్స్ బస్సులో వెళ్లారు. అక్కడ విందులో పాల్గొని తిరిగి తమ సొంత గ్రామానికి తిరుగుప్రయాణమయ్యారు. ఈ సమయంలో పరిగి మండలంలోని రంగాపూర్ గ్రామ సమీపంలో బీజాపూర్-హైదరాబాద్ నేషనల్ హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ట్రావెల్ బస్సు బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఒక్కరు స్పాట్‌లోనే చనిపోగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా ముగ్గురు మార్గమధ్యలో మృతి చెందారు. 20 మందికి పైగా గాయపడగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మృతులు బాలమ్మ(60), హేమలత(30), మల్లేష్(26), సందీప్(28)గా గుర్తించారు. వీరంత షాబాద్ మండలానికి చెందిన వాసులుగా పోలీసులు తెలిపారు.