Site icon Prime9

Telangana News: నేటి నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు.. బడ్జెట్ ఎప్పుడంటే?

Telangana Assembly Budget Sessions Begins From Today: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉదయం 11 గంటలకు తొలుత గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఉభయసభలను ఉద్దేశించి అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. 13న గవర్నర్ ప్రసంగంపై చర్చ ఉంటుంది. 14న హోలీ సెలవు కారణంగా అసెంబ్లీకి కూడా సెలవు ప్రకటించారు. 15న గవర్నర్ ప్రసంగానికి సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు. అయితే మరోవైపు ఈ సభను గురువారానికి వాయిదా వేసే అవకాశం ఉంది.

 

రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై సర్కార్‌ను ఇబ్బంది పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్‌తో పాటు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు అధికార పార్టీ కూడా సిద్దమవుతోంది. ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం, మంత్రులు భేటీ అయ్యారు. బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఆయా శాఖలకు నిధులపై ప్రతిపాదనలు సమర్పించారు. ఈనెల 19న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి మూడు లక్షల 20 వేల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఈ సమావేశాలు ఈనెల చివరి వరకు జరగనున్నాయి.

 

ఇందులో భాగంగానే బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులతో పాటు ఇతర బిల్లులపై చర్చించనున్నారు. అయితే రెండు వారాల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల చివరి వరకు జరిగే ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను రాష్ట్ర సర్కార్ ఉభయ సభల ముందుకు తీసుకురానుంది. ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీలకు 42శాతం రిజర్వేషన్ పెంపు వంటివి ప్రవేశపెట్టనుంది. దీంతో పాటు ఇతర బిల్లులను సైతం అసెంబ్లీ కౌన్సిల్ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది.

 

కాగా, నేటి నుంచి సమావేశాలు ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అధికారులతో స్పీకర్ ప్రసాదరావు సమీక్షించి పలు సూచనలు చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. అసెంబ్లీ వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు పోలీసులు అనుమతులు నిరాకరించారు.

Exit mobile version
Skip to toolbar