KA Paul : సీఎం కేసీఆర్ సీఎం అయి తొమ్మిదేళ్లయినా విద్యార్దులకు అవసరమైన టాయిలెట్లను నిర్మించలేకపోయారని ఇదేమి బంగారు తెలంగాణ అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన సరూర్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. ఇక్కడ 700 మంది విద్యార్దులకు ఒకటే టాయిలెట్ ఉండటం దారుణమని అన్నారు. తాను 56 ముస్లిందేశాలను, 54 ఆఫ్రికా దేశాలను చూసానని కాని ఎక్కడా ఇటువంటి పరిస్దితి లేదన్నారు. తాను తలుచుకుంటే 24 గంటల్లో టాయిలెట్లు నిర్మించి ఇస్తానన్నారు. ఇక్కడ నలుగురు టీచర్లు తాను సీఎం అయితే రామరాజ్యం తీసుకు వస్తానని అన్నారని తెలిపారు.
స్దానిక బీజేపీ కార్పోరేటర్ ఆకుల శ్రీవాణికి వందకోట్లు ఆస్తి వుందని విద్యార్దులకు పది టాయిలెట్లను ఐదు లక్షలు ఖర్చు పెట్టి కట్టించలేరా అంటూ ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ప్రాంతంలో ఉన్నారని అయినా ఏమీ పట్టించుకోలేదని అన్నారు. బండి సంజయ్ మసీదులు తవ్వుతామంటూ పనికిరాని వ్యాఖ్యానాలు చేస్తున్నారని పాల్ ఆరోపించారు. తనలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండాలని పలువురు కోరుతున్నట్లు పాల్ తెలిపారు.
బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాలను నాశనం చేసిందని పాల్ అన్నారు. తాను కసిగా దృష్టిపెడితే 5 లక్షల కోట్లు అప్పు తీర్చేసి మోదీకి, కేసీఆర్ కు బుద్ది వచ్చేలా చేస్తానని అన్నారు. తనను ఎంతోమంది కలుస్తున్నారని వారిలో ప్రొఫెసర్లు, కోదండరామ్ లాంటి పెద్దలు, గద్దర్ లాంటి వారు కూడా ఉన్నారని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజలు నరకం చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తమలో తాము కొట్లాడుకుని బీజేపీలో చేరవద్దని పాల్ సలహా ఇచ్చారు.