AP Assembly Budget Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు శాసనసభలో 2025-26 బడ్జెట్‌పై తుది చర్చ నడుస్తోంది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు మంత్రులను ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన ప్రకటన చేశారు. బెదిరింపులు, అభియోగాలతో జగన్ తనకు లేఖ రాశారని అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ అవాకులు, చవాకులు పేలారు. స్పీకర్‌కు హైకోర్టు సమన్లు ఇచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారన్నారు.
ప్రతిపక్ష హోదాపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పీకర్ అన్నారు. తనకు ప్రతిపక్ష హోదా అర్హత ఉందంటూ జగన్ అసంబద్ధ వాదన చేస్తూ గతేడాది జూన్ 24న ఓ లేఖ రాశారన్నారు. అయితే స్పీకర్‌కు దురుద్దేశాలను ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘనే అని తెలిపారు. అందుకే స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్‌ను క్షమిస్తున్నానని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు.
జగన్ ఇలాగే వ్యవహిరస్తే ఏం చేయాలో సభకే వదిలిపెడుతున్నానని చెప్పారు. కనీసం 10 శాతం సీట్లు లేకపోతే ప్రతిపక్ష హోదా రాదని జగన్‌కు తెలుసన్నారు. గతంలోనూ ఎవరికీ ఇవ్వలేదని తెలిసి కూడా జగన్ ఇలా వ్యవహరిస్తున్నారని స్పీకర్ సభ దృష్టికి తీసుకొచ్చారు.
ఇదిలా ఉండగా, గవర్నర్ స్పీచ్, బడ్జెట్ ప్రసంగంపై వైసీసీ అధినేత, మాజీ సీఎం జగన్ స్పందించారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు బడ్జెట్‌లు ప్రవేశపెట్టారన్నారు. రెండు బడ్జెట్లలోనూ ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు.