TTD ready to Take action on YCP Leader Bhumana Karunakar Reddy: వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు టీటీడీ సిద్ధమైంది. ఎస్వీ గోశాలలో గోవుల మృతిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని భూమనపై ధర్మకర్తల మండలి ఫిర్యాదు చేసింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎస్వీ గోశాలలో 100 గోవులు మృతిచెందాయని, పవిత్రమైన గోశాలను గోవధ శాలగా మార్చారంటూ భూమన కరుణాకర్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని భాను ప్రకాశ్‌రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు చేసిన భూమనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.
భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహారం..
ఈ సందర్భంగా భానుప్రకాశ్ మీడియాతో మాట్లాడారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ నేత భూమన వ్యవహరించారని ఆరోపించారు. ఎస్వీ గోశాలపై అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను ఆధారాలతో బయట పెడుతామన్నారు. భూమన మాత్రం నోరు ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాతున్నారని మండిపడ్డారు. కరుణాకర్‌రెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు పెద్దసంఖ్యలో గోవులు మృతిచెందాయని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పురుగులు పట్టిన ఆహారాన్ని గోవులకు పెట్టారని ఆరోపించారు. గోవిందుడు, గోవులతో ఆటలు వద్దని వైసీపీ నేతలను హెచ్చరించారు. టీటీడీలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.