CM Chandrababu : రాష్ట్రాన్ని మహిళా పారిశ్రామికవేత్తల హబ్‌గా తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మహిళల భాగస్వామ్యం లేకుండా ప్రగతి అసాధ్యమన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో పురుషులతో సమానంగా మహిళలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తామన్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అరటి వ్యర్థాలతో తయారు చేసిన టోపీని ధరించారు. పోలీసు శాఖ ఏర్పాటు చేసిన శక్తి యాప్‌ను చంద్రబాబు ప్రారంభించారు. చేనేత రథాన్ని ప్రారంభించారు.
మహిళా రైడర్లను ప్రోత్సహిస్తాం..
ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. గుర్రపుడెక్క, అరటి, కొబ్బరి వ్యర్థాలతో పీచు తయారీ ద్వారా మంచి ఆదాయం వస్తుందన్నారు. దీనిపై మహిళలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మంచి నాణ్యత, బ్రాండింగ్ తీసుకురావాలని కోరారు. మహిళా రైడర్లను ప్రోత్సహిస్తామన్నారు. ప్రధాన నగరాల్లో వెయ్యి మంది మహిళా రైడర్లకు 760 ఈ-బైక్లు, 240 ఈ-ఆటోలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ర్యాపిడో మహిళా డ్రైవర్లను అభినందించారు.
పురుషులను మించుతున్నారు..
మహిళలు శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూ సంపాదనలో పురుషులను మించిపోతున్నారని తెలిపారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2023-24 ప్రకారం శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందన్నారు. మహిళల కోసం వర్క్ ఫ్రం హోం విధానాన్ని తీసుకు వస్తున్నామని చెప్పారు. మహిళలు పురుషుల కంటే ఎక్కువ సంపాదించే పరిస్థితులు తీసుకొస్తామన్నారు.
విశ్వవిఫణిలో రాణించాలి..
మహిళలు విశ్వ విపణిపై రాణించాలని కోరారు. ప్రతిఒక్కరూ ఆర్థిక స్వావలంబన సాధించాలనే ఉద్దేశంతో ఏడాదిలో లక్షమంది పారిశ్రామికవేత్తలు తయారు కావాలన్నదే తమ లక్ష్యమన్నారు. మహిళలు ఆర్థిక శక్తిగా ఎదగాలని సీఎం అకాంక్షించారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మహిళలు తమ సత్తా చాటేందుకు కూటమి ప్రభుత్వం కార్యక్రమాలు అమలు చేయనుందని చెప్పారు. ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
బేరమాడి భార్యకు చీర కొనుగోలు..
పర్యటనలో భాగంగా డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. డ్వాక్రా మహిళలు తయారుచేసిన వస్తువులను పరిశీలించి, తన భార్య నారా భువనేశ్వరికి పట్టుచీర కొనుగోలు చేశారు. మంగళగిరి పట్టుచీరలను పరిశీలించి, షర్టు, పంచె, కండువాను కొనుగోలు కూడా కొన్నారు. మహిళా వ్యాపారవేత్తలతో వ్యాపారం ఎలా సాగుతోందమ్మా? అని ఆరా తీశారు.