Amravati Development Works : రాజధాని అమరావతి పున:ప్రారంభ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ రానున్నారు. ఈ మేరకు ప్రధాని పర్యటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించారు. ఇవాళ అసెంబ్లీని ఛాంబర్‌లో మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అమరావతి పనుల పున:ప్రారంభంపై ప్రధాని ముందు ఉంచాల్సిన ప్రతిపాదనలపై చర్చించారు. ప్రధాని అనుకూల సమయం, అందుబాటులో ఉన్న ముహూర్తం తదితర అంశాలపై కూడా చర్చించారు. ప్రధాని మోదీ కార్యక్రమం కోసం స్థలం ఎంపిక ఇతర అంశాలపైన సుదీర్ఘంగా సీఎం చర్చించారు. నవ నగరాల్లో ఇంకా పనులు ప్రారంభించాల్సినవి ఏంటి.. వాటిల్లో ప్రధాని మోదీతో ఏవి శంకుస్థాపన చేయించాలి అనే అంశాలపై సీఎం నివేదిక తయారు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ప్రధానిని కలిసి రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి రావాలని మోదీని చంద్రబాబు ఆహ్వానించనున్నారు.
ఇప్పటికే రూ.22 కోట్లకు పైగా అమరావతిలో పనులు చేసేందుకు సోమవారంకేబినెట్ ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పనులు పున:ప్రారంభిస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించారు. ఇందులో భాగంగా ముహూర్త సమయాన్ని సిద్ధం చేసుకుని ఢిల్లీ వెళ్లారు. అందులో భాగంగా సమయం బాగుంటుందనే దానిపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు, పవన్ కల్యాణ్..
మరోవైపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లారు. రాత్రికి ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూతురు వివాహ రిసెప్షన్‌కు హాజరు కానున్నారు. రేపు మధ్యాహ్నం గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించనుంది. ఈ అంశాలపై ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ ఒప్పందాలు చేసుకోనున్నాయి. రేపు సాయంత్రం సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి బయలుదేరి అమరావతికి తిరిగి వస్తారు. 20న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు. 20వ తేదీ రాత్రికి అమరావతి నుంచి తిరుమలకు వెళ్లనున్నారు. 21న తిరుమలలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శించుకుంటారు.