Crime News : పురాణాలు, శాస్త్రాలు ప్రకారం మాత, పిత, గురు, దైవం అని… ఆ విధంగా మనం వారిని గౌరవిస్తూ వస్తున్నాం. తల్లిదండ్రుల తర్వాత విద్య నేర్పే గురువుకి అంతటి అత్యున్నత స్థానాన్ని కేటాయిస్తున్నాం. అలాంటి గురువు దారి తప్పి బిడ్డల లాగా చూసుకోవాల్సిన వారిపైన అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటనలు నిత్యం చూస్తూనే ఉంటున్నాం. అలాంటి ఘటనల పట్ల ప్రజలు కూడా తీవ్రంగా స్పందించి వారికి తగిన శాస్తి చెబుతున్నారు. అయితే చిన్న వయస్సులోనే ఆడపిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని అవగాహన కల్పించడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ముఖ్యం అనిపిస్తుంది. పవిత్ర దేవాలయంగా భావించే బడిలో ఓ ఉపాధ్యాయుడు నీచానికి దిగాడు. చదువు చెప్పాల్సింది పోయి… విద్యార్దినిలను తాక కూడని చోట తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు.
కాకినాడ జిల్లా జీ మేడపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ లో రమణ సోషల్ టీచర్ గా పని చేస్తున్నారు. కాగా అతను తమని తాకకూడని ప్రాంతంలో ముట్టుకునే వాడిని ఏడో తరగతి విద్యార్దులు చెబుతున్నారు. నడుం పట్టుకుని దగ్గరికి లాగే వాడని… బూతులు మాట్లాడుతూ తిట్టేవాడని విద్యార్థినుల ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇదే విషయంపై హెడ్ మాస్టర్ కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విద్యార్థినులు వాపోతున్నారు. కాగా నేడు గడప గడపకు కార్యక్రమంలో భాగంగా హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు స్కూల్ లో పర్యవేక్షించగా విద్యార్దినిలు తమ బాధను ఆయనతో వెల్లడించారు.
దీంతో విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. వారి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు తెలుపుతున్నారు. సోషల్ టీచర్ రమణపై కఠిన చర్యలు తీసుకోవాలని, కంప్లైంట్ ఇచ్చిన కూడా పట్టించుకోని హెడ్ మాస్టర్ పై కూడా చర్యలు తీసుకోవాలని విద్యార్దుల తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.