Site icon Prime9

Gorantla Butchaiah Chowdary : వైసీపీ హయాంలోని లిక్కర్, మైనింగ్ కుంభకోణాలు : గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు

Gorantla Butchaiah Chowdary

Gorantla Butchaiah Chowdary

Gorantla Butchaiah Chowdary : నియోజకవర్గాల పునర్విభజనపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాన్ అంతర్గతంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ఎన్డీఏలో తాము భాగస్వామ్యంగా ఉన్నందున బహిరంగంగా మాట్లాడకూడదని చెప్పారు. జనాభా విషయంలో దక్షిణాది రాష్ట్రాలు చాలా క్రమశిక్షణ పాటించాయన్నారు. ఇప్పుడు జనాభా పేరుతో సీట్లు తగ్గించడం సరికాదని చెప్పారు.

 

 

 

నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అపర గోబెల్స్‌లా మాట్లాడారని, మరో మూడేళ్ల తర్వాత అధికారంలోకి వస్తానని ఆయన కలలు అంటున్నారని ధ్వజమెత్తారు. జగన్ వచ్చేది రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకేనని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలోని లిక్కర్, మైనింగ్ కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయన్నారు. జగన్ హయాంలో పంటలకు బీమా చెల్లించకపోవడంతో రైతులు రూ.వేల కోట్లు నష్టపోయారని గుర్తుచేశారు. గత ప్రభుత్వం గ్రామాల్లో రోడ్డు కూడా వేయలేదని ఆరోపించారు. జగన్ మళ్లీ జైలు ఊచలు లెక్కించాల్సిందేనని తేల్చిచెప్పారు.

 

 

 

దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఇచ్చి ప్రజలను ఆదుకుంటున్నామని చెప్పారు. మేలో తల్లికి వందనం, జూన్‌లో అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. రానున్న పుష్కరాలకు రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. రాజమహేంద్రవరంలో 12 ఎకరాల్లో క్రికెట్ స్టేడియం నిర్మాణం జరగబోతుందన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్నితో ఇప్పటికే మాట్లాడినట్లు చెప్పారు. గతంలో వైసీపీ కార్యాలయానికి రాజమహేంద్రవరంలో అధికారులు తక్షణమే స్థలం ఇచ్చేశారని, టీడీపీ కార్యాలయం కోసం స్థలం అడుగుతుంటే మాత్రం ఇవ్వడం లేదని గోరంట్ల తెలిపారు.

Exit mobile version
Skip to toolbar