Road Accident in srishatyasai dist three people died: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా పరిగి మండలంలో ధనపురం క్రాస్ వద్ద జాతీయరహదారి వద్ద గుర్తు తెలియని వాహనం ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు దుర్మరణం చెందారు. అలాగే వాహనంలో ఉన్న ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను వెంటనే హిందూపురం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో అలివేలమ్మ(45), ఆది లక్షమ్మ(65), శాకమ్మ)60) గా గుర్తించారు. అయితే ప్రమాద సమయంలో ఆటోలో 14 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితులు రొద్దం మండలంలోని దొడగట్ట వాసులని పోలీసులు తెలిపారు. వీరంతా కోటిపి చౌడేశ్వరి ఆలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.
కాగా, రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు చనిపోవడం బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబాలకు సీఎం చంద్రబాబు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.