Site icon Prime9

PM Modi AP Tour: ఈ నెల 29న విశాఖ‌కు ప్రధాని మోదీ.. రైల్వే జోన్‌కు శంకుస్థాపన

PM Modi to Visit Visakha on Nov 29 Lay Stone For Green Hydrogen Hub: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29న విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తలపెట్టిన పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయటంతో బాటు ఇప్పటికే పూర్తయిన పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. తన పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో కలిసి ఆయన విశాఖ ఆంధ్రాయూనివర్సిటిలో ఏర్పాటు చేయనున్న సభలో ప్రధాని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఇదీ షెడ్యూల్..
ఈ నెల 29న సాయంత్రం 3.40 గంట‌ల‌కు వాయుమార్గం ద్వారా ప్రధాని ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. అక్క‌డ నుంచి రోడ్డు మార్గం ద్వారా కాన్వెంట్ జంక్ష‌న్, రైల్వే స్టేష‌న్, సంప‌త్ వినాయ‌క్ టెంపుల్, టైకూన్, సిరిపురం జంక్ష‌న్ మీదుగా ఎస్పీ బంగ్లా రోడ్డు నుంచి ప్ర‌ధాన వేదిక వ‌ద్ద‌కు 4.40 గంట‌ల‌కు వ‌స్తారు. ఈ క్ర‌మంలో టైకూన్ జంక్ష‌న్ నుంచి ఎస్పీ బంగ్లా వ‌ర‌కు 500 మీట‌ర్ల మేర రోడ్ షో నిర్వ‌హిస్తారు. 4.45 నుంచి 5.00 గంట‌ల వ‌రకు గ‌వ‌ర్న‌ర్, సీఎం, డిప్యూటీ సీఎంతో క‌లిసి వివిధ ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేస్తారు. అనంతరం 5.25 నుంచి 5.43 గంట‌ల‌కు ప్ర‌ధాని ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడతారు. 5.45 గంట‌ల‌కు స‌భా వేదిక‌ నుంచి ఎయిర్ పోర్టుకు తిరుగుప‌య‌న‌మ‌వుతారు.

ప్రారంభోత్సవాల వివరాలు..
ఆ రోజున ఆంధ్రా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సభా వేదిక నుంచే ప్రధాని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్టీపీసీ నిర్మించే గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్, మరికొన్ని ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం రూ.85 వేల కోట్ల పెట్టుబడితో 25 వేల మందికి ఉపాధి లభించనుంది. 2032 నాటికి ఈ ప్లాంట్ నుంచి 60 గిగావాట్ల విద్యుత్తు ఉత్పత్తే లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్తులో అధిక భాగం రాష్ట్ర అవసరాలకు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఇందులో 50 శాతం వాటాను ఏపీజెన్‌కోతో పెట్టించాలని నిర్ణయించింది. ఎన్టీపీసీ, జెన్‌కో సంయుక్త భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కిస్తున్నారు. ఇక, విభజన హామీల్లో ఒకటైన రైల్వే జోన్‌కూ ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.

అధికారుల కసరత్తు..
ప్రధాని పర్యటన సందర్భంగా ఆదివారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పలు విభాగాల అధికారులు సమీక్ష నిర్వహించారు. ప్ర‌ధానికి స్వాగతం మొదలు రోడ్ షో, ప్ర‌జ‌ల‌కు తాగునీరు, ఆహారం, ఇత‌ర వ‌స‌తుల క‌ల్ప‌న‌ త‌దిత‌ర అంశాల‌పై ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులకు కలెక్టర్ కీలక సూచ‌న‌లు చేశారు. కార్య‌క్ర‌మంలో భాగంగా వచ్చే గ‌వ‌ర్న‌ర్, సీఎం, డిప్యూటీ సీఎం తదితరులకు నోవాటెల్, పోర్టు గెస్ట్‌హౌస్‌లో వసతి ఏర్పాటుకు ఆయన ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమానికి విశాఖ‌ ఎంపీ ఎం. శ్రీభ‌ర‌త్, ప‌శ్చిమ ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ విప్ గ‌ణబాబు, గాజువాక ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు, ఉత్త‌ర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పెందుర్తి ఎమ్మెల్యే పంచ‌క‌ర్ల రమేశ్ బాబు, అధికారులు హాజరయ్యారు.

Exit mobile version