Site icon Prime9

Araku Coffee Stalls : పార్లమెంటులో అరకు కాఫీ ఘుమ ఘుమలు.. స్టాల్స్ ఏర్పాటు

Araku Coffee Stalls

Araku Coffee Stalls

Araku Coffee Stalls : ఏపీలోని అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌‌లో ఇవాళ అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. స్పీకర్ ఆదేశాలతో రెండు స్టాళ్ల ఏర్పాటుకు లోకసభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ అరోరా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సంగం 1, 2 కోర్టు యార్డు వద్ద స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ నెల 28 వరకు స్టాళ్ల ఏర్పాటుకు అవకాశం కల్పించింది. ఎంపీ సభ్యులు అల్పాహారం తీసుకునే సంగం కాంటీన్‌లో గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసింది. లోకసభ కాంటీన్‌లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అరకు స్టాల్ ప్రారంభించారు. రాజ్యసభ కాంటీన్‌లో వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. కార్యక్రమానికి గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జోయల్ ఓరం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ, బీజేపీ ఎంపీలు హాజరయ్యారు.

 

 

సంతోషంగా ఉంది : ఎంపీ కలిశెట్టి
పార్లమెంట్‌లో అరకు వ్యాలీ కాఫీ స్టాళ్లు ఏర్పాటు చేశారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. తూర్పు కనుమల నుంచి దేశ పార్లమెంట్ వరకు అరకు వ్యాలీ కాఫీ ప్రస్థానం దేశంలో ప్రతిఒక్కరికీ తెలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఏపీ గిరిజనుల కష్టాన్ని ప్రపంచం గుర్తించబోతుందన్నారు. వారు పండించిన కాఫీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి నిలయమైన భారత పార్లమెంట్‌లో ఎంపీలు అందరినీ అమోఘమైన రుచితో మైమరపించబోతుందన్నారు. స్టాళ్లను కేంద్ర మంత్రులు ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు.

 

 

ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌కు ధన్యవాదాలు : సీఎం చంద్రబాబు
అరకు కాఫీ గురించి మన్ కీ బాత్‌లో ప్రస్తావించినందుకు ప్రధాని మోదీ, పార్లమెంట్‌లో కాఫీ స్టాల్ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఈ మైలురాయిని నిజం చేసిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ ప్రాంగణంలో కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేసిన సందర్భంగా ‘ఎక్స్’ వేదికగా సీఎం స్పందించారు.

 

 

ఇది మనందరికీ, ముఖ్యంగా గిరిజన రైతులకు గర్వకారణం అన్నారు. వారి అంకిత భావం, కృషి అరకు కాఫీని జాతీయ స్థాయికి తీసుకెళ్లిందన్నారు. ప్రతి కప్పును ఆస్వాదిస్తుంటే.. వారి స్ఫూర్తిదాయక ప్రయాణం గుర్తుకురావాలన్నారు. పార్లమెంట్‌లో మన అరకు కాఫీ స్టాళ్లను ప్రారంభించేందుకు ప్రోత్సహించిన సీఎం చంద్రబాబుకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version
Skip to toolbar