Site icon Prime9

Vizag Railway zone: విశాఖలో జోన్‌ కార్యాలయం.. నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించిన రైల్వేశాఖ

Indian Railways Invites Tenders For Visakha Railway Zone: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తోంది. కేంద్రం కూడా ఏపీపై ఫోకస్ చేస్తూ శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటూ చంద్రబాబు ప్రభుత్వానికి అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు కీలక అడుగుపడింది. జోనల్ కార్యాలయం నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లు పిలిచింది. 9 అంతస్తులు, రెండు సెల్లార్ పార్కింగ్ ఫ్లోర్లతో కలిపి మొత్తం 11 అంతస్తుల్లో భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 53 ఎకరాల భూమిని రైల్వేశాఖకు అప్పగించింది. దాంతో జోన్ కార్యాలయం నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ షురూ అయింది. విశాఖలో నిర్మించే కార్యాలయాన్ని రూ.149.16 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. డిసెంబర్ 27లోగా టెండర్లను దాఖలు చేయాలని కోరింది.

భూసేకరణ చేసి రైల్వేకు అప్పగించిన కూటమి ప్రభుత్వం ..
ఆగస్టులో చినగదిలి మండలం ముడుసర్లోభ గ్రామంలోని సర్వే నెంబర్లు 57, 58, 59/1, 61/1, 62, 63, 64, 65లో దాదాపు 53 ఎకరాల భూమిని కూటమి ప్రభుత్వం సేకరించింది. కూటమి ప్రభుత్వం 53 ఎకరాల భూమిని రైల్వే శాఖకు అప్పగించగా, జోన్ కార్యాలయ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టారు.

149.16 కోట్లతో కార్యాలయ నిర్మాణం..
రూ.149.16కోట్ల అంచనా వ్యయంతో భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. డిసెంబర్ 27వ తేదీలోపు ఆసక్తి ఉన్న కాంట్రాక్టర్లు టెండర్లను దాఖలు చేయాలని రైల్వేశాఖ ఇప్పటికే ప్రకటించింది. టెండర్లు దక్కించుకున్న సంస్థ రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని పేర్కొంది. ప్రధాని మోడీ ఈ నెల 29న విశాఖకు వేదికగా రైల్వే జోన్ టూ కు శంకుస్థాపన చేయడంతో పనులను పరుగులు పెట్టించాలని రైల్వే శాఖ భావిస్తుంది.

రైల్వే జోన్ కార్యాకలాపాలపై స్థానికుల డిమాండ్
విశాఖ రైల్వే జోన్ మంజూరు చేసిన నేపథ్యంలో జోన్ కార్యకలాపాలు ప్రారంభించాలని విశాఖవాసులు డిమాండ్ చేస్తున్నారు. భవన నిర్మాణాలతో సంబంధం లేకుండా తొలుత జోన్ కార్యకలాపాలను ప్రారంభిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version