Site icon Prime9

GV Reddy: ఫైబర్‌ నెట్‌ చైర్మన్‌ పదవికి జీవీరెడ్డి రాజీనామా

GV Reddy Resign AP Fibernet Chairman: ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పదవితో బాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

తీవ్ర విమర్శలు..
ఫైబర్ నెట్‌లో వైసీపీ అక్రమంగా నియమించినఉద్యోగుల తొలగింపు, జీఎస్టీ చెల్లింపుల వంటి అంశాలపై మూడు రోజుల క్రితం కీలక అధికారులపై జీవీ రెడ్డి ఆరోపణలు చేశారు. వైసీపీకి విధేయులుగా ఉంటూ సంస్థలోని కీలక అధికారులు తన ఆదేశాలను పాటించటం లేదని ఆయన వాపోయారు. ముఖ్యంగా సంస్థ ఎండీగా ఉన్న ఐఎఎస్ అధికారి దినేష్ మీద ఆయన మండిపడ్డారు. సంస్థను చంపే కుట్రకు తెరతీసి రాజద్రోహానికి పాల్పడుతున్నారంటూ భరద్వాజ (చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌), సురేష్‌ (బిజినెస్‌ హెడ్‌), శశాంక్‌ (ప్రొక్యూర్‌మెంట్‌ ఆఫీసర్‌)లను టెర్మినేట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

రూ.370 కోట్ల పెనాల్టీ..
ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌లో 410మంది అక్రమ నియామకాలను రద్దు చేస్తే వారిని ఇంతవరకు తొలగించకుండా జీతాలు చెల్లిస్తున్నారని చెప్పారు. అధికారుల అలసత్వం కారణంగా జీఎస్టీ అధికారులు రూ.370 కోట్ల పెనాల్టీ విధించారని తెలిపారు. ఈ మొత్తాన్ని ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ చెల్లించదని, జీఎస్టీ పెనాల్టీకి కారణమైన ఎండీ దినేష్ కుమార్, ఈడీ(హెచ్‌ఆర్‌) రమేష్‌ నాయుడు నుంచి రికవరీ చేయాలన్నారు. విజిలెన్స్‌ కమిటీ రూ.60 కోట్ల చెల్లింపులను నిలిపివేయాలని చెప్పినా.. వారు చెల్లించేశారని తెలిపారు. ఈ డబ్బులను కూడా వారి నుంచే రికవరీ చేస్తామన్నారు. దినేష్‌కుమార్, రమేష్‌ నాయుడుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అడ్వొకేట్‌ జనరల్‌కు ఫిర్యాదు చేస్తానని, వారి ఆదేశాలకు అనుగుణంగా తాను నడుచుకుంటానని జీవీ రెడ్డి చెప్పారు.

ఫలించని సీఎం జోక్యం..
ఏపీ ఫైబర్ నెట్‌ సంస్థలో ఇటీవల చైర్మన్, ఎండీ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎండీ, చైర్మన్‌ను కూడా సీఎం చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడారు. అయినా ఈ వివాదం చల్లారకపోవటం, అదే అధికారులతో తాను పని చేయలేనని జీవీ రెడ్డి సీఎంకు చెప్పినట్లు సమాచారం. ఫైబర్‌ నెట్‌ చైర్మన్‌ పదవితోపాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వం, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు తన రాజీనామా లేఖను పంపించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇకపై న్యాయవాది వృత్తిలో కొనసాగుతానని వెల్లడించారు.

Exit mobile version
Skip to toolbar