Ananthapur: భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో అనంతపురం, కర్నూలు జిల్లాల గుండా ప్రవహించే వేదవతి నది గత వందేళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా పొంగి పొర్లుతోంది. ఈ నది పై కర్ణాటక ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టుల కారణంగా దశాబ్దాలుగా నీరు అడుగంటింది. నది ఆనవాళ్లు కూడా మారిపోయే పరిస్థితి దాపురించింది. 1982, 1996లో కొద్దిగా ప్రవాహం వచ్చింది. ఆ తర్వాత నదిలో నీరు కనిపించలేదు.
ఇప్పుడు భారీ వర్షాల కారణంగా వేదవతి ఉగ్రరూపం దాల్చింది. వేదవతిపై నిర్మించిన భైరవానితిప్ప ప్రాజెక్టు నుంచి అన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా 63 వేల క్యూసెక్కుల నీటిని వదలడం ఇదే తొలిసారి. వరద కారణంగా పరీవాహక ప్రాంతాల్లో వేసిన పంట కొట్టుకుపోయింది. మరోవైపు ఎప్పుడూ లేని విధంగా వేదవతి పొంగి పొర్లుతుండటంతో స్థానికులు ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు. ఇంతటి ప్రవాహాన్ని ఎప్పుడు చూడని స్థానికులు నదిని అబ్బురంగా తిలకిస్తున్నారు.