Elephants Attack on Devotees in Annamaiya District: ఏపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లి మండలం గుండాలకోనలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఈ ఏనుగుల దాడిలో ఐదుగురు భక్తులు మరణించారు. మహా శివరాత్రిని పురస్కరించుకొని 30 మంది భక్తులు గుండాలకోన శివాలయంలో జాగరణ చేసేందుకు వెళ్తుండగా.. ఒక్కసారిగా ఏనుగులు మంద వారిపైకి దూసుకొచ్చాయి.
ఈ ఏనుగుల గుంపు ఐదుగురిని తొక్కి చంపాయి. దీంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులంతా వై.కోట వాసులుగా గుర్తించారు. గాయపడిన వారిని రైల్వే కోడూరు ఆస్పత్రికి తరలించారు.
అన్నమయ్య జిల్లాలో భక్తులపై ఏనుగుల దాడి ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరా తీశారు. అనంతకం స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్‌ను అసెంబ్లీ నుంచి హుటాహుటినా వై.కోటకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించాలని సూచించారు. అలాగే చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. మరోవైపు, ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.
అంతేకాకుండా, ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిహారం ప్రకటించారు. ఈ మేరకు మరణించిన బాధిత కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అనౌన్స్ చేశారు. అలాగే క్షతగాత్రుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఇస్తామని పేర్కొన్నారు. రేపు మహాశివరాత్రి సందర్భంగా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.