Deputy CM Pawan Kalyan in AP Assembly Meetings: ఏపీ అసెంబ్లీ సమావేశాలు 10వ రోజు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు.
జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4,500కోట్లతో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఈ నిధులతో 30వేల పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని చెప్పారు. సంక్రాంతి లోగా ఆ పనులు పూర్తి చేస్తామన్నారు. ఉపాధి హామీ కింద కాలువల్లో పూడికతీత, గుర్రపుడెక్క తొలగింపు, శ్మశానవాటికల ప్రహరీల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు.
అనంతరం గత ప్రభుత్వ హయాంలో ఉపాధి పథకం నిధులు దారి మళ్లింపుపై విరుచుకుపడ్డారు. గతంలో రూ.331కోట్ల ఉపాధి హామీ నిధుల దారి మళ్లింపుపై విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. ఉపాధి హామీ పథకంతో పాటు గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని విమర్శలు చేశారు. ఇలా వైసీపీ హయాంలో దాదాపు రూ.13వేల కోట్లు దారి మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా జాబ్ కార్డు విషయంలో చాలా అవకతవకలు జరిగాయని, వీటిపై చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వ హయాంలో పనులు చేపట్టకపోయినా నిధులు విడుదల జరిగిందని మండిపడ్డారు. ఈ విషయంపై విచారణ లోతుగా జరగాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ వదిలి పెట్టమని చెప్పారు.
ఇదిలా ఉండగా, అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తి పరిణామం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణలు కలిశారు. ఈ మేరకు ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఒకరినొకరు నమస్కారం చేస్తూ అప్యాయంగా పలకరించుకున్నారు. అనంతరం ఆలింగనం చేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.