Site icon Prime9

Deputy CM Pawan Kalyan: కాలుష్య నివారణపై పవన్ క్లారిటీ.. పీసీబీ నివేదిక వచ్చిన వెంటనే ప్రత్యేక చర్యలు

Deputy CM Pawan Kalyan speech about Visakhapatnam pollution: విశాఖ తీరంలో కాలుష్య నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఏపీ శాసనమండలి సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో పలు ప్రశ్నలకు పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం కాలుష్య నివారణకు చర్యలు తీసుకోకపోవడంతో విపరీతంగా పెరిగిందని విమర్శలు చేశారు. విశాఖ తీరంలో వాయి కాలుష్య స్థాయి దాదాపు 7 రెట్లు పెరిగిందని వెల్లడించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.

పర్యావరణ క్షీణత, కాలుష్య ప్రభావం తగ్గించేందుకు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. కాలుష్య తీవ్రత, నివారణపై పీసీబీ అధ్యయనం చేస్తుందన్నారు. ఈ నివేదిక 2025 జనవరి నాటికి వస్తుందన్నారు. ఈ నివేదిక రాగానే విశాఖలో కాలుష్య నివారణకు కార్యాచరణ చేపట్టనున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. కాలుష్య నివారణకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

విశాఖపట్నంలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు పరిశ్రమల నిర్వాహకులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. కాలుష్యం వ్యాప్తి చెందకుండా కొత్తగా టెక్నాలజీ సహాయంతో తగ్గించేలా చేస్తామన్నారు. అలాగే, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా జీడీపీ వృద్ధి, ఉపాధి అవసరమన్నారు. భారీ వనరులైన శిలాజ ఇంధనాల వినియోగం, మైనింగ్ కార్యకలాపాలు, పట్టణీకరణ, వాహనాల సముదాయాల పెరుగుదల వంటివి కాలుష్యానికి ప్రధాన కారణాలుగా తెలుస్తోందన్నారు.

అభివృద్ధి, ఉపాధికి అవసరమైన విషయాల్లో రాజీపడకుండా కాలుష్య సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. యునైటెడ్ నేషన్స్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం ఊహించిన విధంగా సుస్థిర అభివృద్ధి ఉండేలా భవిష్యత్ తరాలకు తమ అవసరాలను తీర్చుకునే విధంగా సామర్థ్యానికి రాజీపడకుండా ప్రస్తుత తరాలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో పారిస్‌లో జరిగిన సమావేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుందని, దీనికి భారత్ సైతం సంతకం చేసినట్లు పేర్కొన్నారు. 2070 నాటికి కర్బన ఉద్గారాలను తగ్గించడం.. రికవరీ, రీసైకిల్ వంటివి చేపట్టనున్నారు.

అలాగే, ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో అనేక విధాలుగా దెబ్బతిందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోందన్నారు. వేగవంతమైన ఆర్థిక వృద్ధి, యువతకు ఉపాధి కోసం పారిశ్రామిక నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ భారీ పెట్టుబడుల కోసం దృష్టి సారించిందన్నారు. రాస్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి భరోసా కల్పిస్తూనే.. పర్యావరణ క్షీణత ప్రభావాన్ని తగ్గించడం కోసం ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

విశాఖ నగరంలో కాలుష్య సమస్యను ప్రభుత్వం గుర్తించిందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ కాలుష్య సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా వాయి కాలుష్య మూలాలు గుర్తించడానికి విశాఖ నగరంలో పీసీబీ నిర్వహించే ఓ నూతన అధ్యయనం ప్రారంభమైందన్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు దృష్టి సారించిందన్నారు. కంప్రెస్ట్ బయోగ్యాస్ వంటి ద్వారా తగ్గించేందుకు చర్యలు చేపడతామన్నారు. గతంలో జీడిపప్పు తొక్క కాల్చడంతో కాలష్యం పెరిగేదని, ప్రస్తుతం జీడిపప్పు ద్వారా ఆయిల్ సేకరించి ఆదాయం సమకూర్చుతున్నట్లు చెప్పారు. ప్రధానంగా కాలుష్యానికి కారణమైన బొగ్గు వాడకాన్ని తగ్గిస్తుందని తెలిపారు.

Exit mobile version