Site icon Prime9

Deputy CM Pawan Kalyan: కూటమి సర్కారులో ప్రతి మహిళకూ భద్రత.. ఈ విషయంలో రాజీ పడబోం

Deputy CM Pawan Kalyan: మహిళలకు సంబంధించిన మిస్సింగ్ కేసులను ఛేదించిన విజయవాడ సిటీ పోలీసులకు మంగళవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పటిష్టమైన లా అండ్ ఆర్డర్ అమలు చేస్తామని ముందే చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు.

ఆది నుంచే ఆగని పోరు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో 30 వేల మంది మహిళలు, బాలికలు అదృశ్యమైనా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గతంలో పలుమార్లు నాటి ప్రభుత్వం మీద ధ్వజమెత్తారు. వారి అదృశ్యంపై ఒక్క ప్రకటనా జగన్ సర్కార్ చేయలేదని ఆయన అప్పట్లో మండిపడ్డారు. మహిళ భద్రతపై ఇంత ఉదాసీనత తగదని, మానవీయ కోణంలో ఆలోచించాలని కూడా ఆయన గత ప్రభుత్వానికి విపక్ష పార్టీ నేతగా విజ్ఞప్తులూ చేశారు. అయితే, నాటి ప్రభుత్వం ఆయన వినతిని పట్టించుకోకగపోగా, తీవ్రమైన పదజాలంతో దూషణలకు పాల్పడింది. దీంతో రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం రాగానే, ఏపీలో ఈ పరిస్థితిని మార్చుతామని జనసేనాని పలు సభలలో ప్రకటించారు.

పోలీసులూ.. శభాష్
కాగా, ఇటీవల ఎన్టీఆర్‌ జిల్లాలో అదృశ్యమైన 18 మంది మహిళలు, బాలికల ఆచూకీని విజయవాడ స్పెషల్‌ ఇన్వెస్ట్‌గేషన్‌ టీమ్‌ పోలీసులు గుర్తించారు. తక్కువ వ్యవధిలోనే మిస్సింగ్‌ కేసులను ఛేదించినట్లు కమిషనర్‌ ఎస్‌వీ రాజశేఖర్‌ బాబు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. దీనిపై మంగళవారం ఏపీ డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ స్పందించారు. ఎంతో అంకిత భావంతో వారం రోజులలోనే ప్రత్యే క శ్రద్ధ పెట్టి మరీ అదృశ్యమైన మహిళలు, అమ్మాయిల ఆచూకీ తెలుసుకున్న పోలీసులను అభినందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో మార్పు మొదలైందని చెప్పారు. ఇలాగే కొనసాగుతూ పూర్తి మార్పును తీసుకువస్తామని పవన్ పేర్కొన్నారు.

ఇదీ మా హామీ
‘వైకాపా హయాంలో 30 వేల మందికిపైగా మహిళలు, అమ్మాయిలు అదృశ్యమయ్యారు. దీనిపై గత వైకాపా ప్రభుత్వం ఒక్క ప్రకటన కూడా చేయలేదు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే శాంతిభద్రతలు కాపాడుతామని.. లా అండ్‌ ఆర్డర్‌ను పటిష్టంగా అమలు చేస్తామని ప్రకటించాం. అదృశ్యమైన వారి ఆచూకీ తెలుసుకున్న విజయవాడ పోలీసులు, హోం శాఖకు నా అభినందనలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆడబిడ్డల భద్రతకు పూర్తి భరోసా ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి పోలీసు శాఖకు పూర్తి సహకారం ఉంటుంది’ అని పవన్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇది పౌరుల ఉమ్మడి భాధ్యత
మహిళల భద్రత, వారి హక్కులు పరిరక్షించేందుకు ఏపీ పోలీసులకు సీఎం చంద్రబాబు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని డిప్యూటీ సీఎం చెప్పారు. అలాగే మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపైనా కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖకు పూర్తి మద్దతు ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ పౌరులు సైతం చురుకుగా, అప్రమత్తంగా ఉంటూ మన గ్రామాలు, పట్టణాలు, నగరాలను సురక్షితంగా మార్చుకోవాలని, వాటిని మరింత భద్రంగా మార్చేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

గుక్కెడు తాగునీరూ ఇవ్వలేదు
గత వైసీపీ ప్రభుత్వం తాగునీటి సరఫరాలో పూర్తి నిర్లక్ష్యం వహించడం వల్లే ఏపీ ప్రజలు డయేరియా వంటి రోగాల బారిన పడ్డారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. జగన్ సర్కార్‌ నిర్లక్ష్యంతోనే రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రజలు అనారోగ్యం బారిన పడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో గ్రామానికి కనీసం రూ.4 లక్షలు ఖర్చు చేయలేకపోయారని, ఐదేళ్లలో ఒక్కసారి కూడా నీళ్ల ట్యాంకుల ఫిల్టర్ బెడ్స్ మార్చలేకపోయారని ధ్వజమెత్తారు. తమ పాలనలో ఏపీ ప్రజలకు స్వచ్ఛమైన నీరందించడంపై ఎన్డీయే ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టామని, ఈ మేరకు గుడివాడ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఫిల్టర్ బెడ్లు మార్చామని, అందుకు రూ.3.3 కోట్ల వ్యయం అయిందని ఆయన తెలిపారు. ఫిల్టర్ బెడ్స్ విషయంలో ఎక్కడా రాజీపడవద్దని అధికారులను ఆదేశించినట్లు పవన్ చెప్పారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు ఎప్పటికప్పుడు నిర్దేశిత కాల వ్యవధిలో నిర్వాహణ పనులు చేపట్టాలని,ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు సరఫరా అనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. గుడివాడ నియోజకవర్గంలో చేసిన పనుల విధానాన్ని మోడల్‌గా తీసుకోవాలని ఆయన చెప్పారు. ప్రజారోగ్య పరిరక్షణ, కనీస మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు.

పెట్టుబడులపై చర్చలో పవన్
సచివాలయంలో స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన మంగళవారం జరిగింది. బోర్డు తొలి సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్‌, మంత్రులు లోకేశ్‌, పయ్యావుల కేశవ్‌, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్‌, టీజీ భరత్‌, నారాయణ, కందుల దుర్గేశ్‌, గొట్టిపాటి రవికుమార్‌, సుభాష్‌, బీసీ జనార్దన్‌రెడ్డి, సీఎస్‌ నీరభ్‌ కుమార్‌, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో గడచిన 5 నెలల్లో వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలు, ఒప్పందాలు, వాటి పురోగతిపై చర్చించారు. ఈ సమావేశంలో రూ.85వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. 34 వేల ఉద్యోగాలు కల్పించే 10 భారీ పరిశ్రమలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నక్కపల్లిలో ఆర్సెలర్‌ మిత్తల్‌ అండ్‌ నిప్పన్‌ స్టీల్‌ రూ.61,780 కోట్ల పెట్టుబడితో 2029 నాటికి 21 వేల మందికి ఉపాధి కల్పించనుంది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.5001 కోట్ల పెట్టుబడితో 1,495 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. కల్యాణి స్ట్రాటజీ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ రూ. 1,430 కోట్ల పెట్టబడితో 565 మందికి ఉపాధి లభించనుంది. టాఫే పరేషియా ఇండియా లిమిటెడ్‌ రూ.76 కోట్ల పెట్టుబడి (250 ఉద్యోగాలు) పెట్టనుంది. ఫిలిప్స్‌ కార్బన్‌ బ్లాక్‌ లిమిటెడ్‌ రూ.798 కోట్లు పెట్టబడితో 200 మందికి ఉపాధి లభించనుంది. ఆజాద్‌ ఇండియా మొబిలిటీ లిమిటెడ్‌ రూ.1,046 కోట్ల పెట్టుబడి(2,381 ఉద్యోగాలు) పెట్టనుంది. డల్లాస్‌ టెక్నాలజీ సెంటర్‌ ఎల్‌ఎల్‌పీ రూ.50 కోట్లు(2 వేల ఉద్యోగాలు), ఆస్తా గ్రీన్‌ ఎనర్జీ వెంచర్స్‌ రూ.8,240 కోట్లు( 4వేల ఉద్యోగాలు, గ్రీన్‌ సోలార్‌ ఐఆర్‌ఈపీ లిమిటెడ్‌ రూ.2వేల కోట్ల పెట్టబడి(1725 ఉద్యోగాలు), ఎకోరెన్‌ ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌ రూ.1662 కోట్ల పెట్టుబడి (350 ఉద్యోగాలు) పెట్టనున్నాయి. ఉద్యోగాలు ఇచ్చే సంఖ్య మేరకు, ఇటీవల ప్రకటించిన పారిశ్రామిక పాలసీకి అనుగుణంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు.

Exit mobile version