Pawan Kalyan : పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేన పార్టీలో చేరారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పార్టీ కండువా కప్పి దొరబాబును జనసేనలోకి ఆహ్వానించారు. తూర్పుగోదావరి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్తపల్లి పద్మ, వైసీపీ కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు జనసేన పార్టీలో చేరారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్, శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
2019 ఎన్నికల్లో దొరబాబు వైసీపీ పార్టీ నుంచి పిఠాపురంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో సీన్ మొత్తం మారిపోయింది. పిఠాపురం పవన్ పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో పిఠాపురం నియోజకవర్గం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా గెలువటం, ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతోంది. దీంతో చాలా చోట్ల నేతలంతా జనసేన పార్టీలో చేరుతున్నారు. మరోవైపు కూటమి నేతలు పవన్‌కు సహకరిస్తుండటంతో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ బలం పెరిగింది.